కొన్ని మంచి కలలు కొన్నిచక్కని పలవరింతలు
జనగణమణ మొత్తం పాట ఐదు చరణాలుంటాయి. అందులో నుంచి కేవలం కొంత భాగాన్ని అది భౌతికమైన భూ ఖండానికి సంబంధించినంత వరకు మాత్రమే జాతీయగీతంగా తీసుకొన్నాం. అందువలన యిరవైయవ శతాబ్దపు మొదటి రోజుల్లో మన కవులు, రచయితలు భారత జాతీయతను యెంత విశాలంగా అర్ధం చేసుకున్నారో మనకు తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. పైగా పనిగట్టుకొని 'జార్జ్ బ్రిటీష్ సార్వభౌముడికి సలాములు చెప్పుకొంటూ ఠాగూర్ రాసిన పాట యిది' అని దుష్ప్రచారాలు చేసే శక్తులు బలం పుంజుకొంటున్న కొద్దీ ఆ విశాలత్వం కుంచించుకుపోయే పరిస్థితి వచ్చేసింది. ఠాగూర్ రాసిన పాటలో వున్న అధినాయుకుడు యే తుచ్ఛమైన “మనుజేశ్వరాధముడు” అయి వుండే అవకాశం అసలు లేదు. ప్రపంచం నలుమూలలు కాలచక్రము కింద నలిగి పోయి నిరాశకు లోనై భయావహులై పడివున్న హిందువులు, సిక్కులు ముస్లింములు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పారశీకులు, యెవరైనా సరే వారికి తూర్పున కొండన వుదయభానుణ్ణి చూపించి ప్రేమమయమైన తన హస్తాలతో చేరదీసుకొని అక్కున చేర్చుకొని పీడకలలను తుడిచివేసే సర్వోత్తమైన శక్తి జనగణమణలో వున్న అధినాయకుడు. ఠాగూర్ పాటలో వున్న మార్మికతను విమర్శించే మనుషులు వుండొచ్చు కానీ యీ దర్శనాన్ని నేలకి యీడ్చి కేవలం మూడు నాలుగు మతాలకు మాత్రమే ఆశ్రయం యిస్తుంది మన జాతీయత.........................