ద్రిమ్మరి
నేను, అతన్ని నాలుగు రోడ్ల కూడలిలో కలుసుకున్నాను; అతని దగ్గర ఒక దుప్పటి, చేతి కర్ర మాత్రమే ఉన్నాయి. అతని ముఖం బాధ అనే ముసుగుతో కప్పబడి ఉంది. మేము ఒకరినొకరం పలకరించుకున్నాం. నేను అన్నాను, అతడితో, "నా ఇంటికి రండి, నా అతిథిగా ఉండండి.”
మరి, అతను వచ్చాడు.
నా భార్య, పిల్లలు వాకిట్లోనే మమ్మల్ని కలుసుకున్నారు. అతను వారిని చూసి, చిరునవ్వు నవ్వాడు. వారు అతని రాకను అభిమానించారు.
తరువాత, మేమందరం కలిసి, బల్ల దగ్గర కూర్చున్నాం. అతనితో మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే, అతనిలో ఒక నిశ్శబ్దం, ఒక రహస్యం లాంటిది ఉంది.
రాత్రి భోజనం తర్వాత, మేము నెగడు దగ్గర చేరాం. నేను అతని సంచారాలను గూర్చి అడిగాను.
అతను మాకు అనేక కథలు చెప్పాడు, ఆరాత్రి, మరుసటి రోజు కూడా. కాని, నేను చెప్పబోయే విషయాలు ఆయన కష్టదినాలను గురించినవే, కాని అతను మాత్రం దయతో ఉన్నాడు. ఈ కథలు, ఆయన దుమ్ములో, ఓర్పుతో రోడ్డుమీద తిరిగిన సంగతులే.
తరువాత, మూడురోజులకి అతను మమ్మల్ని వదిలి వెళ్లాడు. కాని మేము భావించలేదు, ఒక అతిథి వెళ్లిపోయాడని, మాలో ఒకరు బయట తోటలోనే ఉన్నారని, ఇంకా ఇంట్లోకి రాలేదని అనుకుంటున్నాం...............