కాకతీయుల చరిత్రను కథలుగా చెప్పిన
డా॥ గుంజి వెంకటరత్నం గారు
డా॥ గుంజి వెంకటరత్నంగారు ప్రధానంగా సాహిత్య పరిశోధకుడు. తెలుగులో "విజ్ఞాన సర్వస్వాలను" (ఎన్సైక్లోపీడియా) వెలువరించటం ఆయన పరిశోధనలోని ఒక ముఖ్యాంశం.
ఆయనకు దాదాపు 800 సంవత్సరాల క్రితం, వరంగల్లును రాజధానిగా చేసుకొని, తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ యేకత్రాటి కిందకు తెచ్చిన కాకతీయులంటే చాలా ప్రేమ. అందువల్ల ఆయన కాకతీయులను గురించి చాలా పరిశోధన చేశాడు. ఆ పరిశోధనను వ్యాసాల రూపంలో కాకుండా కథల రూపంలోకి మార్చి "ఓరుగల్లు కథలు" పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాడు. అంతేగాక, అలనాటి కాకతీయుల రాజధాని, నేటి తెలంగాణాలో చారిత్రకంగా పేరు పెంపులు గల వరంగల్కు సంబంధించిన అన్ని విషయాలతో 'వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వము' అనే ఉద్గ్రంధాన్ని, (దాదాపు 1000 పుటలు) అక్షర క్రమంలో నిర్మించి 2008లో ప్రచురించారు.
ఈ గ్రంథంలో కాకతీయుల చరిత్రకు సంబంధించిన 25 కథలున్నాయి. అందుకే దీన్ని ఆయన "కాకతీయ పంచవింశతి" అని కూడా అన్నాడు.
"కాకతీయుల కథలే ఎందుకు చెప్పాలి?” అన్న ప్రశ్నకు గుంజి వెంకటరత్నం గారు ఇలా సమాధానం చెప్పారు.
"భౌగోళికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సంస్కృతీపరంగా అనేక కారణాలు కనిపిస్తాయి. ఈ దృష్టితో కాకతీయుల చరిత్రను అధ్యయనం చేస్తే అవన్నీ మనకు అవగతమవుతాయి. కాకతీయులు రాజులే అయినా ప్రజా కంటకులుగా కాకుండా. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన ప్రజా పాలకులు. రాజులు దేశ రక్షణకై యుద్ధాల్లో తలమునకలుగా ఉంటే, వారి మహిళలు, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డారు...................