మొదటి అధ్యాయం
పుట్టు పూర్వోత్తరాలు
చంబల్నది వొడ్డున తోమర్దార్లో రెండు ఊళ్ళున్నాయి. గ్వాలియర్ రాజ్యంలోనే ఎంతో పేరుమోసిన ఊళ్ళవి. కారణం ఆ గ్రామాల్లోని ప్రజలు జగమొండులు, బలవంతులు కావడమే. వాళ్ళు ప్రభుత్వాధికారాన్ని ఏమాత్రం లెక్కచేసే వాళ్ళు కారు. అక్కడి భూకామందుల వరస ఏమిటంటే, వాళ్ళకు బుద్ధిపుట్టిన సంవత్సరం శిస్తు కట్టే వాళ్ళు. లేని ఏడాది శిస్తుయిచ్చేది లేదని సూటిగా నిరాకరించే వాళ్ళు! శిస్తు వసూలుకు తాసీల్దారో లేక మరే ప్రభుత్వ అధికారో బయలుదేరి వచ్చాడనుకోండి, యిక అంతే. అక్కడి భూకామందులంతా ఒక్కరు ఊళ్ళో లేకుండా బీళ్ళలోకి జారుకునే వాళ్ళు. ఇలా నెలల తరబడి బీళ్ళలోనే కాలం గడిపేసే వాళ్ళు. తమ పశువులను కూడా అక్కడికే తోలుకుని వెళ్ళేవాళ్ళు. వంటావార్పులూ అన్నీ అక్కడే. ఊళ్లో ఇళ్లవద్ద విలువైన వస్తువులంటూ ఏవీ వుంచే వాళ్ళు కారు - వాటిని వేలంవేసి శిస్తు వసూలు చేసుకొనే అవకాశం ప్రభుత్వాధికారులకు యివ్వరాదని. ఇలాంటిదే ఒక భూకామందు వింతకథ ఆ ప్రాంతంలో బాగా చెప్పుకుంటుంటారు. శిస్తు చెల్లించకపోవడం వల్లే అతగానికి ఉచితంగా కొంత భూమి లభించిందని! ఆ కామందు కూడా అనేక సంవత్సరాలు యిలాగే తప్పుకు తిరిగాడట. అయితే ఒకసారి ఎలాగో మోసపోయి పట్టుబడ్డాడు. తహసీలు అధికారులు మొదట అతడికి ఎంతగానో నచ్చజెప్ప చూచారట. కాని సుతరామూ వినకపోతే అనేక రోజులు అన్నం, నీళ్లు యివ్వకుండా కట్టిపడేసి వుంచారు. అయినా లొంగకుంటే చివరికి సజీవదహనం చేస్తామని బెదిరించి, ఎండుగడ్డి మోపులు తెచ్చి కాళ్ల కింద వేసి మంట కూడ పెట్టారట. ఎంతయినా ఆ కామందు మహాశయుడు శిస్తు చెల్లించడానికి అంగీకరించలేదట. "నేను శిస్తు కట్టనంత మాత్రాన గ్వాలియర్ మహారాజు ఖజానా ఏమీ కరిగిపోదులే” అని మొండిగా జవాబిచ్చాడట. ఇలా కేవలం మొండితనంతోనే నెగ్గుకొచ్చేవాళ్లు కొంతమంది వుంటారని మన లోకులకు అంతగా తెలవదు! చివరికి విసిగి ప్రభుత్వాధికారులు మహారాజు కార్యాలయానికి ఈ సంగతంతా రాసి పంపిస్తే, దానికి జవాబుగా ఎంత శిస్తు అయితే ఆ మహానుభావుడు చెల్లించాల్సి వుందో అంతమేర భూమి అతనికి ఉచితంగా దానం చేస్తూ ఉత్తరువు వచ్చిందట!
ఇలాగే మరోసారి ఈ గ్రామాల ప్రజలకు ఒక అద్భుతమైన ఆట తోచింది....................