స్ఫూర్తిదాయకం
- పొత్తూరి వెంకటేశ్వరరావు
మనదేశం స్వతంత్రం కావటానికిముందు సుమారు ఒక వంద సంవత్సరాలు ఇంగ్లీషు పత్రికలకు ఎక్కువమంది తెలుగువారైన జర్నలిస్టులే అధిపతులై జాతీయస్థాయిలో పత్రికారంగాన్ని ఏలారు. విలేఖరులుగా, సంపాదకులుగా పనిచేసి ప్రసిద్ధులైనారు. స్వాతంత్ర్యోద్యమంలోవలెనే పత్రికా రచనలోనూ ఆంధ్రులది అగ్రస్థానమైంది. వారిలోనూ కోటంరాజు సోదరులు పురోగాములు. ఇద్దరిలో పున్నయ్యగారు పెద్ద. రామారావుగారు ఆయన తరువాతవారు. ఇంగ్లీషు జర్నలిజం గురించి ఏమాత్రం తెలిసినవారికైనా వెంటనే స్ఫురించే మరొకపేరు ఖాసా సుబ్బారావుగారు. ప్రస్తుతానికి కోటంరాజు సోదరులను గురించే, వారిలోనూ రామారావుగారిని గురించే ఇక్కడ ప్రస్తావన.
హైదరాబాద్ లో జర్నలిస్టులకు కోటంరాజు రామారావుగారిపట్ల ఉన్న ఆరాధనాభావానికి శాశ్వతచిహ్నంగా బంజారాహిల్స్లో ఆయన పేరిట జర్నలిస్టుల కాలనీ వెలసింది. జర్నలిస్టుల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి నేను అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నిర్మించుకొన్న జర్నలిస్టుల కాలనీ ఇది. అప్పటి రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి ప్రారంభోత్సవం చేశారు. కాలనీ ప్రారంభంచేయటానికి ఆహ్వానించినప్పుడు 'ఇంత చిన్న కార్యక్రమానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రావటం బాగుంటుందా!' అని మొదట గిరిగారు సందేహం వ్యక్తపరిస్తే, 'చిన్నది కాదండీ ఇది, ఇది మేము కోటంరాజు రామారావుగారి పేరు పెట్టుకొంటున్న గొప్ప కాలనీ!' అని చెప్పగానే ఆయన నవ్వి 'అలాగా! రామారావుగారి పేరు పెట్టారా! సరే, వస్తాను' అని వచ్చి ప్రారంభోత్సవం చేశారు.........................