ఒకటి
అంగడాయన శివను ఎగాదిగా చూశాడు. "ఏం గావాల నీకు?" శివ చేతిలో బెడ్రోప్, సూట్కేసుతో అతని ముందు నిలబడుకొని ఉన్నాడు.
"తిరువారూర్ పోయే బస్సు ఎక్కడ ఆగుతుంది?" శివ రెండోసారి అడిగాడు. "ఓ అది... అదిగో ఆ మూల ఆగుతుంది. అక్కడికి పో, పండ్లేమన్నా కొనుక్కుంటావా?”
పండ్లు కొనుక్కుంటే వాటిని తీసుకుపొయ్యేదెట్లాగో శివకు అర్థం కాలా. పండ్లు తినాలని కూడా అనిపించలేదు. “రెండు అరటిపండ్లివ్వు”.
“ఒక డజన్ తీసుకో... కొండరటిపండ్లు... మంచిరకం... ఇప్పుడే వచ్చినాయ్... ఒక డజన్ తీసుకో...”
"రెండు చాలు... రెండే రెండివ్వు”
"సరే. అయితే నోటుకు చిల్లర అడగొద్దు. పదహైదు పైసలియ్యి” “నా దగ్గర చిల్లర లేదు”.
"అయితే ఉరుకు. నువ్వెక్కకుండానే బస్సు పొయ్యేట్టుంది”, "సార్! ఏమి కావాల? మామిడిపండ్ల?”
అంగడాయన శివను పనికిరాని బంతిని పక్కకు తోసేసినట్లు తోసేశాడు. అతని దృష్టిని, అతని మర్యాదను పొందాలంటే ఏమి చేయాలి? అంగట్లో పండ్లన్నీ కొనేయాల్నా? వాటిని కొని ఎక్కడ పెట్టుకోవాల? తీసుకుపొయ్యేదెట్లా? అన్నిటినీ కొని మళ్ళీ అంగడాయనకే తిరిగివ్వాలా? ఇది భలే తమాషా. ఎలాగో ఒకలాగ అహం తృప్తి పొందాల.
అంగడాయన చూపించిన చోట చాలా రద్దీగా ఉంది. ఖాకీ బట్టలు వేసుకున్నాయన్ని జనం చుట్టుము ట్టేసి ఉన్నారు. శివ అక్కడ నిలబడి ఉన్నవాళ్ళలో ఒకాయన్ని అడిగాడు "ఏమిటిది?” “తిరువారూర్ బస్సు బయలుదేరబోతా ఉండాది. ఆయన టికెట్లు కొడతా ఉండాడు" తిరువారూర్కు టికెట్ ఆ రకంగా తీసుకోవాలన్న మాట.....................