మగాడు
డి. పి. అనురాధ
ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారి నుంచి ఫోను. కొత్త కాదు. డిపార్టుమెంటు రికార్డుల్లో మాత్రమే భద్రంగా పడుండే వాళ్ల కష్టం... అదే నా చెవిన పడితే, కాస్త నలుగురికీ తెలుస్తుందని వారికో నమ్మకం. అందుకే రొటీన్గా దొరికేవి కాకుండా ఏదైనా కొత్తగా దొరికితే ఇలాంటి పిలుపులు మామూలే. ఈ సారి మోటుపల్లిలో దొరికాయట. తామ్రపత్రాలనే ఫోన్లో చెప్పాడు. లిపియైతే పాత వేంగి లిపికి దగ్గరగానే ఉంది కానీ భాష ఏదో బోధపడట్లేదనీ అన్నాడు. అయినా... బోధపడిపోయే భాష అయితే వారి పిలుపు మనదాకా ఎందుకు వస్తుంది? బయల్దేరాను. ఆ రాగిరేకుల్లో ఏ కాస్త విషయం ఉన్నా... మంచి పేపర్ అవుతుంది.
'తవ్వకాల దగ్గర మట్టికొట్టుకు పోయుంటారనుకున్నా! టెంపరరీవే అయినా, బాగా ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తున్నారే,' అన్నాను ఇదివరకటికి, ఇప్పటికీ ఉన్న తేడా చూసి ఆశ్చర్యంగా.
'అప్పుడప్పుడూ లీడర్లు, మీలాంటి సెలెబ్రిటీలు కూడా విజిట్ చేస్తున్నారుగా...' చిరునవ్వు నవ్వాడు. లోపలి గదిలోకి వెళ్లి, చిన్న ట్రంకుపెట్టె సైజులో ఉన్న రాగి పేటిక తెచ్చాడు. టేబుల్ మీద పెట్టి, దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నట్టు, భుజం మీది నేప్కిన్ తీసి మీద ఉన్న దుమ్ము దులిపాడు.
నెమ్మదిగా తెరుస్తూ, 'లోపల కొన్ని పుస్తకాలున్నాయి మేడం. రాగిరేకును కవర్ పేజీలాగా వాడి, దాని కింద తోలుపట్టాల మీద రాశారు. లిపి మనకు తెలిసీ తెలియనట్టుగా ఉందనుకోండి. మీరైతే పట్టేస్తారు గదా. మైసూర్ పంపే ముందు ఓసారి చూపిద్దామని... ఎందుకు పిలిచాడో వివరిస్తున్నాడు.
రాగిరేకులు రంగుమారిపోయి ఉన్నాయి. కానీ తోలుపట్టాలు పొత్తములు భద్రంగానే ఉన్నాయి. రాత మరీ శిథిలమైపోలేదు. బహుశా ఈ రాగి పేటికలో...........