సంగ్రహ నివేదన
ఒక క్రొత్త పుస్తకాన్ని చూడగానే కలిగే అనుభూతి దానిలో నిగూఢమైన విషయం యేమిటని? ఈ గ్రంథం యొక్క ఉపయోగం ఏమిటని? ఈ "సంగ్రహ నివేదన" ఈ విషయ విశ్లేషణా సంగ్రహము.
"కర్ణాటక సంగీత మార్గదర్శి వింజమూరి వరదరాజ అయ్యంగార్" అనే ఈ గ్రంథరాజానికి పర్యాయనామం "ఆకాశవాణి శాస్త్రీయ సంగీత వినూత్న ప్రక్రియావిష్కర్త". అంటే, వింజమూరివారు ఏ విధంగా ఆకాశవాణి ద్వారా వినూత్న ప్రక్రియలను సృజించి, ప్రవేశపెట్టి మార్గదర్శకులయ్యారు అని. ఈ గ్రంథంలోని ప్రతి ఉపశీర్షిక వారి మార్గదర్శకాన్ని స్పష్టీకరిస్తుంది. ప్రతి ఉపశీర్షిక సంగీతపరంగానూ, సాహిత్య పరంగాను అనేక నూతన, అజ్ఞాత, విజ్ఞాన, విశేష ప్రక్రియలను పరిచయం చేస్తుంది. దీనికి 1880వ సంవత్సరంలో ప్రచురింపబడిన శేషాచలదాస ధర్మపురి రామాయణ యక్షగాన ఆధారంగా కూర్చిన సంగీత రూపకాలు, చెయ్యూరు చెంగల్వ రాయ సుందరేశ విలాసము, సింహగిరి నరహరి వచనాలు, రామాయణ చూర్ణిక, శ్రీరంగ గద్యం, సైంధవి, కైకవశి, నవరత్న విలాసము, నాగగాంధారి వంటి అపూర్వ రాగ లక్షణ వివరాలు ఉదాహరణలుగా చెప్పవచ్చును.
సంగీతాభిలాషులకీ, సాహిత్యాభిలాషులకే కాక, ఈ గ్రంథం భక్తి మార్గణులకు, నృత్యాభిలాషులకు, నాటక, యక్షగాన సంగీత రూపక, ఉపన్యాస ప్రదర్శకులకు, రూపకాభిలాషులకు, సంగీత సాహిత్య, పరిశోధకులకు, సంగీత వ్యాకరణాది విషయ పరిశోధకులకు, తెలుగు, సంస్కృత సాహిత్యాభిలాషులకు, అపూర కృతి శోధకులకు, సంగీత పరమైన అనేక శబ్ద అర్ధ విశ్లేషనలకు గూడా ఉపయోగకరంగా ఉంటుంది.
క్లుప్తంగా చెప్పాలంటే, ఈ గ్రంథరాజం సంగీత సాహిత్య పరమైన ఒక సూచనా గ్రంథంగా, పాఠ్య గ్రంథంగా, విజ్ఞాన గ్రంథంగా ప్రతి సంగీత, సాహిత్యాభిలాషుల ఇంటా ఉండదగిన గ్రంధం. ప్రతి ఉపశీర్షిక ఆ విషయ సమూహానికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చును.
అతి కొలది కాలంలో (సుమారు 6 సంవత్సరాల కాలంలో) వింజమూరివారు ప్రవేశ పెట్టిన నూతన ప్రక్రియలలో ఈ గ్రంథం దొరికిన కొద్దిభాగమే అని విజ్ఞులు గ్రహింపగలరు. అపారమైన ఈ గ్రంథరాజంలో గల విషయ విశేషాలు, రోజువారీ ఇన్ని ప్రక్రియలను గ్రహించి, రచించి, సంగీతం కూర్చి, నేర్పి, సమయోచితముగా ప్రసారం చెయ్యగలగడం అనేది సామాన్య విషయం గారు: సామాన్యులకి అది సాధ్యమూ కాదు! అని స్పష్టీకరిస్తాయి. ఈ గ్రంథాన్ని పరిశీలించిన పెద్దలకు,...................