కారుమబ్బులు - ముందుమాట
రచయిత శ్రీ సచ్చిదానందమూర్తి ఈ పుస్తకానికి 'గమనిక' అంటూ, “దార్శనిక, రాజకీయ, సామాజికాంశాలపై ఇటీవల వ్రాయబడిన ఎనిమిది వ్యాసములు ఇందు సంగ్రహింపబడినవి. అందలి మొదటి నాల్గు వ్యాసములు గుంటూరు నుండి వెలువడు. "భారత మిత్రము" నందు ఇదివరకె ప్రచురింపబడినవి. ఆ పత్రిక అధిపతులకు, సంపాదకులకు అత్యంత కృతజ్ఞుడను అంటూ, ప్రతి వ్యాసమందును ప్రత్యేక విషయమును ఒక విశిష్ట దృక్కోణముతో చర్చింప ప్రయత్నం సలుపబడినది' అని వ్రాశారు.
ఈ పుస్తకం గురించి వారు వివేచించిన తీరు గురించి మా అవగాహనను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. రచయిత ఈ పుస్తకాన్ని తన 23 సం॥ ప్రాయంలో వ్రాశారు. ఈ పుస్తకంలోని విషయాంశాలను పరిశీలించినట్లయితే వారి అనుభవంలోనికి వచ్చిన అంశాలకు వివిధ అధ్యయనాంశాలను చేర్చి ఈ రచన చేసినట్లు తోస్తుంది. ఈ పుస్తకం కంటే ముందుగా ఇంగ్లీషులో 'హిందూయిజం అండ్ ఇట్స్ డవలప్మెంట్'ను రచించినట్లుగా గమనించగలం. మరింతగా ఈ పుస్తకంపై వ్యాఖ్య వ్రాయడానికి ముందుగా మన మెరిగిన ప్రత్యయాలు లేదా భావనల గురించి పర్యావలోకనం సమంజసమని తోస్తుంది.
వారు జీవితంలో రచించిన వివిధ ప్రామాణిక పుస్తకాలను అవలోకించితే, మనలో చాలా మంది ఆధ్యాత్మికత మరియు తాత్వికతల గురించి పొరబడి, తాత్వికుడు అంటే ఆధ్యాత్మికవాది అనే భావన ఏర్పడుతుంది. అయితే ఈ రెండింటికి మధ్య ఒక సరిహద్దు ఉంది. కానరాని శక్తిని గురించి విశ్వసించి, పూజించి, ఆరాధించడమనేది ఆధ్యాత్మికా భావం. అది కేవలం వ్యక్తి విశ్వసానికి సంబంధించింది. దానిని నిర్ధిష్టంగా నిరూపించలేం.
తాత్త్వికత తన దృష్టికొచ్చిన ఏ విషయాన్నైనా సమగ్రంగా విశ్లేషించి, అది తార్కికతకు నిలబడుతుందా లేదా అనే దానిని విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది. అది అలౌకికమైంది, లేదా భౌతిక ప్రపంచానికి లేదా లౌకిక ప్రపంచానికి సంబంధించినదైనా కావచ్చు. ఇక శాస్త్రమంటే తను ఎదుర్కొను లేదా విశ్వసించిన మౌలికాంశాలు (పోస్ట్స్ లేట్స్) ను పరిశోధనాశాలలో శోధించి నిజనిరూపణ చేయటానికి ప్రయత్నిస్తుంది. మొదటిది నిరూపించలేం. రెండవది తార్కికంగా గాని, అనుభవం ద్వారా గాని విశ్లేషణకు ప్రయత్నిస్తుంది. మూడవ దానిలో (సైన్స్) పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ పుస్తకానికి, ఈ పై వాటిని గురించి ఇక్కడ ప్రస్తావించడానికి కారణమైతే ఉందని మా విశ్వాసం..............