కరుణ, శక్తి, కోరిక
కోరికలన్నీ పూర్తిగా తీరిన, అహం పూర్తిగా అంతరించిన బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత నలభై సంవత్సరాలు జీవించాడు. అలాంటి బుద్ధుడిని "మీరు ఈ భూమి పైకి వచ్చిన పని ముగిసింది కదా. అయినా మీరు పైకి పోకుండా ఇంకా ఈ శరీరంలోనే ఎందుకున్నట్లు?" అని చాలాసార్లు అడగడం జరిగింది. ఎందుకంటే, ఎలాంటి కోరిక లేని శరీరం ఈ భూమిపై ఒక్క క్షణం కూడా ఉండదు. అలాంటప్పుడు కోరికలన్నీ పూర్తిగా తీరిన బుద్ధుడు ఇంకా తన శరీరాన్నే పట్టుకుని వేలాడడం తర్కవిరుద్ధంగానే కనిపిస్తుంది. కానీ, ఇక్కడ మీరు అర్ధం చేసుకోవలసిన చాలా లోతైన ఒక విషయముంది. అదేమిటంటే, కోరిక పూర్తిగా అదృశ్యమైనప్పటికీ దానికి సంబంధించిన శక్తి అక్కడే ఉంటుంది కానీ, అది ఏమాత్రం అదృశ్యం కాదు, కాలేదు. ఎందుకంటే, కోరిక కూడా ఒక రకమైన శక్తి స్వరూపమే. అందుకే మీరు ఒక కోరికను మరొక కోరికగా మార్చగలరు.
కోపం కామంగా మారగలదు. అలాగే కామం కూడా కోపంతో పాటు, దురాశగా కూడా మారగలదు. అందుకే పరమ దురాశాపరులందరూ తక్కువ కాముకులుగా మీకు కనిపిస్తారు. నిజానికి, పరమ దురాశాపరుడిలో కాముకత ఏమాత్రముండదు. అందుకే వాడు ఎప్పుడూ బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు. ఎందుకంటే, వాడి శక్తి మొత్తం దురాశగా మారుతోంది. పరమ దురాశాపరుడైన అత్యధిక కాముకుడు మీకు ఎక్కడా కనిపించడు. ఎందుకంటే, వాడు ఎప్పుడూ దేనికీ దురాశపడడు. నిజానికి, వాడికి అలాంటి అవసరమే ఉండదు. కాస్త గమనిస్తే, కాముకతను తీవ్రంగా అణచుకున్న వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం వారి కళ్ళల్లో, ముఖంలో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే, కాముకతను తీవ్రంగా అణచుకున్న వారిలో అది చాలా కోపంగా మారి వారిలో ప్రతిబింబిస్తుంది. అందుకే మీ మునులు, సన్యాసులు ఎప్పుడూ చాలా కోపంతో ఉంటారు. అందుకే వారు వారి నడకలో, చూపులో, మాట తీరులో వారి కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. పైకి వారు చాలా మౌనంగా, నిశ్శబ్దంగా కనిపిస్తున్నప్పటికీ, వారిని మీరు ఏమాత్రం తాకినా, కదిలించినా వారి కోపం వెంటనే బయటపడుతుంది. ఎందుకంటే, తీవ్రంగా అణచిపెట్టబడిన వారిలోని కామశక్తి చాలా తీవ్రమైన క్రోధంగా మారుతుంది. ఎందుకంటే, జీవమే శక్తి...........................