నిర్మాణ నాయకత్వ సమస్యల గురించి
- స్టాలిన్
సరియైన పార్టీ పంథాను రూపొందిస్తే సరిపోతుందనీ, దానిని గొప్పగా చాటి చెప్పి సాధారణ సిద్ధాంత ప్రతిపాదనగా, తీర్మానాలుగా వివరించితే చాలునని, దానిని ఏకగ్రీవంగా ఆమోదింప చేస్తే అంతా అయిపోయినట్లేనని, విజయం దానంతటికదే, యధాలాపంగానే వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ అది తప్పు. అదొక పెద్ద భ్రమ. చచ్చినా మారని నిరంకుశాధికారులూ, నియమాల పేరిట అడుగు ముందుకు వేయకుండా మొరాయించే ఉద్యోగులూ మాత్రమే ఆ విధంగా భావిస్తారు. నిజానికి విజయాలు వాటంతటికవే వూడిపడవు. పార్టీ పంథాను అన్వయించడానికీ, అమలు జరపడానికీ జరిపే తీవ్రమైన పోరాట ఫలితంగా మాత్రమే విజయాలు లభిస్తాయి. విజయం ఎన్నడూ దానికదే లభించదు. దానికి కష్టపడి సాధించాలి. పార్టీ సాధారణ పంథాకు అనుకూలంగా చేసే చక్కటి తీర్మానాలు, ప్రకటనలు కేవలం ప్రారంభం మాత్రమే. అవి విజయం సాధించాలనే కోరికను తెలియపరుస్తాయి తప్ప వాటికవే విజయం ఎంత మాత్రమూ కావు. సరియైన పంథా రూపొందించిన తర్వాత, సమస్యకు సరియైన పరిష్కారం కనుగొన్న తర్వాత, అది అమలు చేసే పనిని ఏ విధంగా నిర్మాణం చేస్తామో దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. పార్టీ పంథాను అన్వయించి అమలు పర్చడానికి నిర్మించే పోరాటంపైన, ఆ పనిలో పెట్టే మనుషులను సరిగా ఎంపిక చేయడంపైన, నాయకత్వ సంస్థల నిర్ణయాలు ఎలా నెరవేరుతున్నాయో సక్రమంగా తనిఖీ చేస్తుండటం పైన విజయం ఆధారపడి ఉంటుంది. అలా కాకుంటే, సరియైన పార్టీ పంథా, సరైన పరిష్కారాలూ కూడా తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంది.......