రాయి రాయి కరిగే యాళైంది. పసిడిగువ్వలు కట్టుకొచ్చినాయి. బాగిచెట్టు గువ్వల కూతలతో మేలుకొనింది. లోకమంతా నిద్దరపోతావుంటే నేను, బాగిచెట్టు, పసిడిగువ్వలు మేలుకొని ఉండాము. బంగ్యాకు తాగతా గుక్కగుక్కకు సొర్గాన్ని మెట్టుమెట్టుగా అందుకొంటా ఉండాను, లచ్చిమి ఇంకా రాలేదు. ఎవుడికి కొంగేసిందో? ఈ రాత్తిరికి వస్తిందో రాదో? ఏటిగెడ్డనుండే బాలాజీ కొటాయిలో రెండో ఆట వొదిలి శానా సేపైంది. ఆకు కదిలినా లచ్చిమి వచ్చిందేమోనని ఆత్తరమాత్తరంగా చూస్తా ఉండాను. ఎదురుచూసి చూసి కండ్లు కాయలు కాసినాయి.
మొనుసు లచ్చిమి కోసరం కట్టుగుటాన పెనుగులాడతా ఉండాది.
కానగమాకుల మిందనుండి గాలి సల్లంగా వీసింది. ఏరుకోగిల కూసినట్టు పాట పాడతా ఉండాది. కనమోరిబాయికాడ టెంకాయ మాకులు గలగలా గొంతు.................