గాయపడిన బతుకుల కథకుడు హరికిషన్
డా॥ ఎం.హరికిషన్ 21వ శతాబ్ది తొలితరం తెలుగు కథారచయిత. ఆయన 20వ శతాబ్దం చివర రెండు మూడేళ్ళలో కథారచన ప్రారంభించి గత రెండు దశాబ్దాలలో అనేక కథలు రాశారు. ఆయన ప్రపంచీకరణ కాలం రచయిత. అస్తిత్వ ఉద్యమాల కాలం రచయిత. రచయితల కాలం, రచయితలు నివసించే నేల, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిసరాల జీవితాలు, వాళ్ళ సాహిత్యం, వీటి మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. హరికిషన్ 21వ శతాబ్దంలో ఉన్నారు. ఆయన తెలుగువాడు. రాయలసీమ వాసి. కర్నూలు జిల్లాకు చెందినవారు. ఆయన నివాసం కర్నూలు నగరం, ఆయన శ్రామికవర్గం నుంచి వచ్చారు. ఆయన వృత్తిపరంగా అధ్యాపకుడు. కులాంతర వివాహం చేసుకున్నారు. అభ్యుదయ సాహిత్యోద్యమతో అనుబంధం గలవారు. సమాజ పరివర్తన ఆయన లక్ష్యం. ఆయనది విమర్శనాత్మక దృష్టి. హరికిషన్ కథాసాహిత్యం ఈ నేపథ్యంలోంచి వచ్చింది. మానవసంబంధాల సారమే సాహిత్యానికి వస్తువు. దానిని సామాజిక వాస్తవికత అంటాం. మానవ సంబంధాలు, స్థలకాలబద్ధమై ఉంటాయి. సాహిత్యం కూడా స్థలకాలబద్ధమైన మానవ సంబంధాలను ప్రతిబింబిస్తుంది. భూస్వామ్య వ్యవస్థలోనూ, పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ, భారతీయ సమాజం అసమ సమాజంగాను ఉంది. వర్గ సమాజంగానూ ఉంది. వర్ణ సమాజంగానూ ఉంది. యజమాని బానిస, పెట్టుబడి దారులు కార్మికుల సంబంధాలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఈ సంబంధాలను మార్చి మానవీయ మానవ సంబంధాల సాధన కోసం అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. వర్గ, వర్ణ, జెండర్, ప్రాంతాల వారీగా ఈ వ్యవస్థలు గాయం చేసేవారు, గాయపడే వర్గం అని రెండు వర్గాలుంటాయి. ప్రగతిశీల రచయితలు గాయపడిన వాళ్ళ పక్షం వహించి రచనలు చేస్తారు.
హరికిషన్ గాయపడిన బతుకులను తన రచనలలో ప్రతిబింబించారు. వాళ్ళ పక్షం వహించారు. హరికిషన్ కథలు చాలా వరకు కర్నూలు జిల్లా కేంద్రంగా నడుస్తాయి. ఆ ప్రాంతపు మానవ సంబంధాలలోని వైవిధ్యం, వైరుధ్యం తన స్వరూపంతో ఆయన కథలలో ప్రతిబింబిస్తాయి. రాయలసీమ నిర్దిష్ట వాస్తవికత, కరువు, దానికి తోడు కక్షలు, కోస్తా ప్రాంతం సినిమాలు చూపించినంత క్రూరంగా కాకపోయినా, రాయలసీమలో కక్షలు ఉండడం ఒక నిజం. ఈ కక్షలు కార్పణ్యాల వెనుక రాజకీయాలున్నాయి. ఇవి రాయలసీమ కథలలో ప్రతిబింబిస్తాయి. రాయలసీమ కథకులు 1940 నుంచీ కరువు కథలు రాస్తున్నారు. 1970. తర్వాత ఆ కథలు ఒక సైద్ధాంతికతను సంతరించుకున్నాయి. 1985 తర్వాత అవి చైతన్య................