"కులవృత్తుల విధ్వంసాన్ని చిత్రించిన కథలు"
గత రెండు దశాబ్దాల కాలంలో వేగంగా విస్తరించిన ఆధునిక సాంకేతిక ప్రగతి కారణంగా, మార్కెట్ స్వరూపమే మారిపోయింది. యంత్రాల ద్వారా ఉత్పత్తి అయిన అసంఖ్యాక పారిశ్రామిక ఉత్పత్తులు, గతంలో కంటే వందల రెట్లు మార్కెట్ను ఆక్రమించినాయి. ప్రజల సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, తినే తిండితో సహా మాయచేసి వస్తు వ్యామోహ సంస్కృతిలో ప్రజలు కొట్టుకుపోయేలా చేసింది. మానవ శ్రమద్వారా, చేతివృత్తులద్వారా ఉత్పత్తి అయ్యే సమస్త సరుకులు మూలబడిపోయే పరిస్థితి దాపురించేలా చేసింది. పాత సంప్రదాయ వస్తూత్పత్తులకు క్రమంగా కాలం చెల్లిపోతుంది. చేతివృత్తుల బతుకులు సంక్షోభంలో పడినాయి.
గౌడ్లకు తాడిచెట్టు ఎక్కి కల్లు గీయడం, గీసిన కల్లును అమ్ముకోవడం కులవృత్తిలో భాగం అయినా, క్రమంగా అది గిట్టుబాటు కాకుండా పోయింది. కూల్డ్రింక్స్, ప్రభుత్వ సారాయితో పోటీ పడలేని పరిస్థితి. కల్లు అమ్ముడుపోక పులిసిపోతే మురికి కాల్వలో పారబోయాల్సిందే. దీనికి తోడు కొత్త మామ్ల కాగానే తాళ్ల శిస్తు వసూళ్లు మొదలుపెట్టడం చాలామందికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అదే సమయంలో పిల్లల అవసరాలు నెత్తిన పడతాయి. కులవృత్తికి తోడు కాస్త వ్యవసాయం ఉన్నవాళ్ల పరిస్థితి పర్వాలేదు గానీ, అచ్చంగా కల్లు మీదనే ఖర్చులన్నీ తీరాలంటే కష్టంగానే ఉంటుంది. ఎంత కాదనుకున్నా మూడు నాలుగు వేలు అప్పు పడడం తప్పదు. సీజన్ వచ్చేదాకా వడ్డీ కట్టడం తప్పదు. ఇవి చాలదన్నట్లుగా మల్లేశం గౌడ్కు కొడుకు పెద్ద సమస్యగా తయారవుతాడు. కులవృత్తి నామోషీ అని భావించి తప్పించుకు తిరుగుతూ, గత రెండేళ్లుగా సింగరేణి కొలువంటూ దళారీల చుట్టూ తిరిగి ఇరవై వేలు ఖర్చు చేశాడు. ఇప్పుడు కువైట్ పోతానని యాభై వేలు ఇవ్వమని పీకల మీద కూర్చుంటాడు. ఇంకోవైపు పెద్దదాని పెళ్లి బాకీ సంగతి అలాగే ఉండిపోతుంది. పిల్లలేమో చిన్నవారు, ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇది ఇట్లుండగా, తాడిచెట్టు మీది నుండి పడి వెంకన్న గౌడ్ ప్రాణాలు వదిలితే, ప్రభుత్వం వారు నష్టపరిహారంగా లక్ష రూపాయలు ఇచ్చారని తెలుస్తుంది. నష్టపరిహారం కోసమేనా ఈ వృత్తులు అని విచారించిన, మల్లేశం జీవితం కూడా అలాగే ముగియడం "అంతర్ముఖం" కథలో కనిపిస్తుంది.
"చలివేంద్రం" కథ కుమ్మరోళ్ల కష్టాలను, బాధలను తెలియజేస్తుంది. ఇందులో వెంకన్న పాత్ర ద్వారా కుమ్మరోళ్ల కష్టాలను తెలియజేస్తారు. మట్టిని తవ్వుకు రావడం, కట్టెలు కొట్టుకొని రావడం ఇప్పుడు కుదరదు. అవన్నీ ఇప్పుడు డబ్బు పెట్టి కొనుక్కోవాలి. బట్టీలో కుండలను..............