దుస్సంప్రదాయాల దహనం- సత్యాగ్ని కథలు
ఈ దేశంలో మౌఢ్య మతాచారాలు, కులాచారాలు, వాటికింద నలిగిపోయే జీవితాలు రుక చాలామందికి లేదు. ముఖ్యంగా ముస్లిం సమాజం విషయంలో వారి సాంప్రదాయాలు, ఆచరణ వక్రీకరణలు, లొసుగులు మనలో చాలామందికి తెలియదు. ముస్లిం స్త్రీల జీవితాల్లో ఆ మతాచారాల వక్రీకరణ వల్ల ఏర్పడిన దుర్భరత మనకసలే తెలీదు. పరదాల మాటున ఉన్న ఆ సమాజం విషయంలో మనకున్న జ్ఞానం రవ్వంత. అందులో కూడా అజ్ఞానం కొంత.
ఆ సమాజం అనుసరిస్తున్న ఆచారాల్లో లొసుగులు, ఆచరణలో ఖురాన్ బోధనల వక్రీకరణల వల్ల పరదా మాటున వెక్కుతున్న స్త్రీల వినిపించని ఏడుపులను సాహిత్యంలోకి తెచ్చిన తొలి ఘనత సత్యాగ్నిది. ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. పరదాలు వేసుకుని జీవించే ఒక సమాజ నిజరూపాన్ని పరదా తొలగించి చూపడం సాహసోపేతం. ఆ సాహసం చేసిన రచయిత సత్యాగ్ని, తెలుగు సాహిత్యంలో ఉన్న అనేకానేక ఖాళీల్లో ఒక ఖాళీని పూరించిన, ఒక కొత్త మలుపు వద్ద దీపధారి అయ్యాడు షేక్ హుసేన్ సత్యాగ్ని.
ఆయన కథల్లో ఎక్కువ భాగం ముస్లిం స్త్రీల కనిపించని కన్నీళ్ళని ఎత్తిచూపుతాడు. సత్యాగ్ని యెంచుకొనే ఏ కథాంశమైనా అభ్యుదయకరంగా ఉంటుంది. అభ్యుదయకరంగా ఉన్నంత మాత్రాన ఒక రచన 'కథానిక' అవుతుందా? కాదని సత్యాగ్నికి తెలుసు. కొ.కు., రా.రా., వల్లంపాటి వంటి ముందుతరం విమర్శకులు చెప్పిన నియమాలన్నీ చాలావరకు ఈ కథల్లో కనిపిస్తాయి. రారా చెప్పిన అనుభూతి సాంద్రతా వుంటుంది. ఆ అనుభూతి సాంద్రత అలంకారాలు నగిషీలతోనో, తమ పాండిత్య తీవ్రతతోనో రచయిత మనకు కలిగించడు. సత్యాగ్ని చెబుతున్న కథాంశాల్లోనే అది యిమిడి వుంటుంది. కథాంశాలను ఎన్నుకోవడంలోనే కాదు, కథానిక నిర్మాణంలోను సత్యాగ్ని తీసుకునే శ్రద్ధ మనకు కనిపిస్తుంది. సత్యాగ్నికి కథానికాతత్వం అలవోకగా అబ్బిందని ఆయన కథలు చెబుతాయి.
"నూరు రూపాయలు' కథ శిల్ప సమన్వితకు పదహారణాల కథ. కథ నడిచే కాలం చాలా కొద్దిసేపు. అయితే కొన్ని నెలల కాలంలో జరిగిన సంఘటనలు కథలో మనకు యెదురవుతాయి. కథలో ప్రత్యక్షంగా తెరమీద కొచ్చినవి రెండు పాత్రలే. బుగ్గవంక కట్ట మీద పోతున్న సుదర్శనంను వెనుక నుండి పిలుస్తూ, ఒక వేశ్య వడివడిగా అతన్ని సమీపించిన దృశ్యంతో రచయిత ఈ కథలోకి మనల్ని తీసుకుపోతాడు. తర్వాత వాళ్లిద్దరి నడుమ జరిగిన సంభాషణే ఈ కథ. రిజర్వేషన్లో ఉద్యోగం కొట్టేసేందుకు 'ఆదర్శ వివాహ సర్టిఫికెట్' కై దొంగనాటకం ఆడిన ఒక..............