తెలుగుసిన్నోడు తిమ్మరాయప్ప
ఆంద్రా నింకా వచ్చిండాడు ఒగాయన. మా ఊర్లోనే ఉండాడు. ఆయప్ప ఈడికి వచ్చిండేది ఏలనో తెల్లేదు. వచ్చినపుటి నింకా "ఏదయినా చెప్పండా, ఏదయినా చెప్పండా” అని బుర్రీగలు బుయ్యిమన్నట్లు చెపుతావ గలాట చేస్తా ఉండాడు. నా జీవిత అనుబవాలు చెప్పాలంట. ఆ మాటకి అర్తమే తెల్లేదు నాకు. “అదేనప్పో నీ బతుకులో నడిసిందే సుద్దులు చెప్పప్పో” అంటాడు తిరగా.
తెల్లవారి అంతపొద్దుకే లేసి చెంబు ఎత్తుకోని కాన తావకి పొయ్యొచ్చి, మేకలిప్పే పొద్దుకి అంత సంగటిముద్ద తిని, చేను తావకి పొయి రెక్కలు ముక్కలు చేసుకొని, పొద్దు మునిగినంక ఇంటికొచ్చి, తిరగా ఒక ముద్ద తిని, ఈతాకు సాపమింద తలమూట యేసుకొని, రగ్గు కప్పుకొని, కడుపులా కాళ్లు ముదురుకొని పణుకొనేదే కదా దినమూ నా బతుకు. నాయట్లా వానికి అనుబోగాలు ఏడనింకా వస్తాయి. అదే ఆయప్ప తావ అంటిని. ఆయప్ప యినుకొంటే కదా. 'ఏదో ఒకటి చెప్పన్నో' అంటా ఒకటే రావిడి.
"ఆయెనప్పా, మా శూలగిర్లా తెలుగు సిన్నోళ్లు టైకు చేసిండిరి. అబుడు మా తిమ్మరాయుడు, బో బల్నాకొడుకు, పెద్ద మేస్టురు పైనే కిర్లిండాడు. ఆ సుద్ది చెప్పమంటే చెప్తానప్పో” అంటిని. ఆంద్రాయప్ప సరేనని యినేకి కూకొనె.
ఓసూరునింకా కిష్ణగిరి పొయ్యే దోవలో ఉంటాది శూలగిరి. ఆ ఊరి పక్కలా త్రిశూలం మాదిరిగా ఉండే పెద్దకొండొ ఉంటాది. దాన్నింకనే ఆవూరిని ఒగప్పుడు త్రిశూలగిరి అనేవాళ్లంట. ఎవుడో నా మాదిరి ఎబ్బేటు నాయాలు నోరు తిరక్క దానిని శూలగిరి అనేసిండాడు. అపుటినింకా ఆపేరే రూడి అయిపోయె ఆవూరికి. శూలగిరిని దాటుకోని ఇంగ రంచ కిందకి పోతే బలే అడువులుంటాయి. కొండలు కూడా చానా పెద్ద పెద్దవి. అవిటిని మేలుమల కొండలు అంటారు. అవి ఏడనింకా ఏడకంటా పోతా ఉండాయో మా తావులా చెప్పేవాళ్లే లేరు. నాకు తెలిసి డెగనీకోట తాలూకాలోని అంచెట్టికి దిగువుండే మంచుకొండపల్లి నింకా ఈతట్టు పలమనేరుకుంటా ఉండాయి. ఈ కొండల్ని దాటేస్తే దిగువసీమ. దిగువసీమంతా కొంగోళ్లు జాస్తి. ఈ కొండలేమన్నా మాకూ దిగువసీమకూ అడ్డంగా లేకపొయ్యింటే, కొంగోళ్లు వచ్చి.............