కవిసార్వభౌముడు
"అక్కా అక్కా శుభవార్త!”
మండువా దగ్గర కూర్చుండి తన చిన్న తమ్ముడగు దుగ్గన్న శిఖలో మల్లెపూల చెండు తురుముచు పరధ్యానముగా నున్న శ్రీదేవికి ఆ కంఠ మెవరిదో గుర్తుకు రాలేదు. స్వతంత్రులైన వారి స్వాతంత్ర్యముతో పాటు వృద్ధులైన వారల గాంభీర్యము కూడా ఆ కంఠధ్వనిలో మిళితమై యున్నది. ఆ రెండింటికి పొంతన కుదరలేదు. ఆమె కాశ్చర్యమై, "ఆ గొంతు ఎవరిదిరా?” అన్నది.
"ఎవరిదో నాకు తెలియడము లేదక్కా - మన లోపలి వాకిటి అరుగు మీది నుంచి వినిపిస్తున్నట్లున్నది. వెళ్లి చూచి వస్తాను" అనుచు దుగ్గన్న వాకిటిలోనికి పోయి కొద్ది క్షణములలోనే సంతోషము వెల్లివిరిసిన ముఖముతో తిరిగి వచ్చి నవ్వుచు, "ఆ గొంతు ఎవరిదో పోల్చుకోలేవా అక్కా! అసలు ఎటువైపు నుంచి వస్తుందో చెప్పగలవా? పోనీ” అనుచు దేవ మందిరము వంక జూచెను. శ్రీదేవి దృష్టి ప్రయత్నముగా ఎదురుగా నున్న గృహదేవతా మందిరము వంకకు ప్రసరించినది. "శుభవార్త! శుభవార్త!”
మరల వెనుకటి కంఠమే ఈ మాటలు పలికినది. ఈ మారు మాత్రమవి తమ దేవమందిరము నుండియే వినవచ్చుచున్నట్లయినవి. ఆనందముతో నామె సర్వాంగములు పులకరించినవి. గేదగి రేకులవంటి ఆమె చెక్కిళ్లు ఎర్రవారినవి.
"దుగ్గా, అది సాక్షాత్తుగా శంకరుని కంఠమువలె నున్నదిరా!"
అక్క మాటలు విని దుగ్గన్న పకపక నవ్వసాగెను. ఆ నవ్వుతో నాతని దేహమంతయు నెగురులాడుచున్నది. "మన తిమ్మరాజు గొంతు అక్కా"...............