ప్రవేశిక
ఒక కవిత్వ ఉత్సవంలోకి మీరు ప్రవేశిస్తున్నారు.
ఒక కాలంలో కొందరు సారస్వతాభిమానులు ఒక నగరంలో కలసి పాడుకున్న పాటలు కొన్ని యీ ఉత్సవంలో మీకు విన్పిస్తాయి. ఎవరి నిత్యజీవిత రణరంగాన్ని వారే ఎదుర్కొంటూ ఎట్లాంటి ముసుగులూ, దాపరికాలు లేకుండా, జీవితపు సాధారణానుభవాలన్నిట్లోనూ అంతర్వాహినిగా తమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విశిష్టమైన దేదో ఆ 'సరస్వతి'ని గానం చేసిన వైనం యీ లోపలిపుటల్లో మీకు కన్పించే కవిత్వం.
2
ఇక్కడ సకల సన్మార్గాల సమ్యక్ సంగమస్థలిలో
భిన్న వ్యాఖ్యానాల ఏకాభిప్రాయంలో
భాషాతీత భావనికరపు సంక్లిష్ట సమాక్లిష్ట నృత్యగతిలో
విఫల మైనది అభివ్యక్తి ...
- అంటాడు బైరాగి తన 'కవి సమస్య'లో.
అటువంటి వేళ, స్వీయ అనుభవాల ఆధారంగా సమకాలీన ప్రపంచం ముందు ఎవరి దృక్కోణాన్ని వారు ఉంచుతున్న ప్రయత్నమే యీ 'కవితావేదిక'. వయసులో, అనుభవంలో, వ్యక్తీకరణలో, ప్రక్రియలో, వస్తువులో ఎంత విభిన్నత ఉండవచ్చునో అంతా ఇక్కడ ఉంది. ఇది 'సకల సన్మార్గాల సమ్యక్ సంగమ స్థలి', 'సమరస పూర్వకమైన వేదిక', 'భిన్న జీవితానుభవ సమ్మేళనం'.............