కొసరాజు పై చంద్రహాసం
పాపినేని శివశంకర్
పోతే? - అనుభవమ్ము వచ్చు.' అనే వాక్యం ఎన్నిసార్లు విన్నా నవ్వొస్తుంది. పేకాట పిచ్చివాళ్లకి గమ్మత్తైన ఓదార్పు. కులగోత్రాలు చిత్రంలో పేకాటలో సర్వ మంగళం పాడిన రమణారెడ్డి మీద రాసిన పాట. 'అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే-జేబులు ఖాళీ ఆయెనే. అటు శోకం, ఇటు హాస్యం. దటీజ్ కొసరాజు!
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లు. భూస్వామ్యంలో రైతుల బ్రతుకులేం తెల్లారలేదు. నెహ్రూ నాయకత్వంలో పరిశ్రమీకరణ మొదలైంది. చదువుతోపాటు నిరుద్యోగమూ పెరిగింది. అంతకుముందే అవినీతి పెరిగింది. ధనిక, దరిద్రవర్గాల మధ్య అంతరం పెరిగింది. పల్లెల్లో బ్రతకలేక పట్టణాలకు వలస మొదలైంది. స్త్రీ జాతిలో అంతో ఇంతో చైతన్యం మొదలైంది. 'రోజులు మారాయి'గానీ కాలం పెద్దగా మారలేదు. కాకపోతే ఘనీభవించిన వ్యవస్థలో ఒకింత కుదుపు. ఇటువంటి సామాజిక స్థితిగతుల మధ్య ఒకానొక పల్లెటూరి రైతు కుటుంబాన పుట్టి పెరిగిన ఆలోచనాపరుడి సాహిత్యం ఎలా మొదలవుతుందో, సాగుతుందో అలాగే కొసరాజు సాహిత్యం వెలువడింది.
బాలకవిగా పేరు గాంచి, అష్టావధాని స్థాయికి చేరి, 'రైతు పత్రిక' ఉపసంపాదకుడుగా పనిచేసి, నటుడుగా రాణించి, గేయరచయితగా స్థిరపడినవాడు కొసరాజు. అయితే ఆయన కవిగా ఎన్నో రచనలు చేసినట్టు అందరికీ తెలీదు. 'మూడణాల పాట', 'కడగండ్లు' (రైతుల కష్టాలు), 'మిత్ర స్మృతి' (చెల్లెలి గురించి), 'గండికోట యుద్ధం' మొదలైన రచనలు కొసరాజును గొప్ప కవిగా నిలబెడతాయి. జాగర్లమూడి కుప్పుస్వామి ప్రోద్బలంతో మద్రాసు చేరి, ప్రాచ్యపుస్తక భాండాగారం శోధించి, గండికోట చిన తిమ్మానాయుడి చరిత్ర పరిశీలించి, 'గండికోట యుద్ధం' ద్విపద కావ్యం రచించాడు కొసరాజు. ఇది మంజరీ ద్విపద. అంటే ద్విపదలో యతి ప్రాసల నియమం ఉంటుంది. మంజరీ ద్విపదలో ప్రాస నియమం ఉండదు. ఇది దేశీచ్ఛందస్సు, మార్గచ్ఛందస్సును వదిలి దేశిని గ్రహించటంలోనే కొసరాజు ప్రత్యేకత ఉంది..............