వెన్నెల కురిసిన కాలం
సవేరా బార్ నుండి రూమ్కి వెళ్తున్నాను. మత్తుగా ఉందంతా. చిత్తుగా తాగిన తర్వాత ఈ మాత్రం మత్తు లేకపోతే ఇగ తాగడమే దండగ. రోడ్డు మధ్యలో నడుస్తున్నాను. ఇప్పుడు భయం లేదు. నాలో ఉన్న భయమంతా ఎటో ఎగిరిపోయింది. లేదు... లేదు... నాలుగు పెగ్గుల మాన్షన్ హౌస్ పవర్ ఇదంతా. ఓహ్ గాడ్! ఈ రాత్రి ఆ పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రాకుండా దీవించు! దీవిస్తావా, లేదా చిన్నప్పటి నుండి వీడు నన్ను మొక్కనే లేదని లైట్ తీసుకుంటావా? అలా మాత్రం చెయ్యకు ప్లీజ్! ఈ దుఃఖానికి విరామం లేకపోతే పిచ్చోణ్నవుతాను. అందుకే ఈ ఒక్క సాయం చెయ్.
హా...! ఘాటుగా పొగ వాసన. పాన్ డబ్బా దగ్గర ఒకడు రెండు సిగరెట్స్ వెలిగిస్తున్నాడు. అది నాకోసమేనా? నా దగ్గరికి వచ్చి తీసుకోమని ఆఫర్ చేస్తే బావుండు. జేబులో సిగరెట్స్ లేవు. కొనడానికి పైసలూ లేవు. ఈ రాత్రి ఎలా గడుస్తుందో దేవుడికే తెలియాలి. సిగరెట్ పొగ అలా లాగుతుంటే పెచ్చుపెచ్చులుగా రాలిపోతుంది దుఃఖం..................