తృష్ణ నణచే జీవనాధార కృష్ణ! వందనం!!
- మండలి బుద్ధప్రసాద్
కృష్ణాజిల్లా ప్రగతితో ముడిపడిన నా జ్ఞాపకాలకు "కృష్ణం వందే జీవనాధారం” పుస్తకం అక్షర రూపం! పుస్తకాలు చదవటం చిన్ననాటి నుండీ సంక్రమించిన ఒక అలవాటు కావటం, సాహితీ ప్రముఖులతోను, చరిత్రవేత్తలతోనూ ఏర్పడిన సాన్నిహిత్యం, యాబదేళ్లుగా కృష్ణాజిల్లా ప్రగతిలో భాగస్వామిని కావటం, కృష్ణాడెల్టా పరిరక్షణ కోసం సాగిన అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించటం ఇవన్నీ ఈ పుస్తకంలోని వ్యాసాల రచనకు నాకు సహకరించిన అంశాలు.
తెలుగు జాతి చరిత్రకు బీజాలు వేసిన ఈ కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని సంరక్షించి అభివృద్ధి పరచచటానికి, ఇక్కడి జీవన వ్యవస్థను మెరుగు పరచటానికి జరిగిన అనేక పోరాటాలలో గత యాబై యేళ్ళ కాలంలో నేనూ ఒక పాత్రధారిగా ఉన్నాను. కృష్ణాడెల్టా పరిరక్షణోద్యమం కన్వీనరుగా రైతుల సంఘటితోద్యమంలో పెద్దల సహకారంతో ముందు పీటీన నడిచాను. డెల్టా ఆధునీకరణ, ముఖ్యంగా మత్స్యకారుల సంక్షేమకోసం అనేక అభివృద్ధి పథకాల సాధనలో ముఖ్య భూమిక వహించాను. నాలుగు పర్యాయాలు అవనిగడ్డ శాసన సభ్యుడిగా కర్తవ్య నిర్వహణ కూడా ఈ పనులకు నన్ను ప్రేరేపించింది. ఇలాంటి జ్ఞాపకాలెన్నింటినో వివిధ సందర్భాల్లో నేను వ్యాసాల రూపాన వ్రాస్తూ వచ్చాను. వాటి సంకలనమే ఈ "కృష్ణం వందే జీవనాధారం". ప్రజల దాహార్తిని, ఆకలిని తీర్చే కృష్ణమ్మకు వందనలతో ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నాను.
వ్యాసాలన్నింటిని పొందికగా కూర్చి పుస్తక రూపానికి తేవటంలో సహకరించిన ఆప్తమిత్రుడు డా|| జి.వి. పూర్ణచందుకు, ప్రచురిస్తున్న కృష్ణాజిల్లా రచయితల సంఘానికి నా కృతజ్ఞతలు.......................