ఈ పుస్తక రచయిత కొమాండూరు రంగనాథాచార్యులు యం.ఏ. (తెలుగు) చదివారు. బాల్యంలోనే పద్యరచన ప్రారంభించిన వీరి గేయాలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. వంశీ ఆర్ట్ థియేటర్స్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీలలో వీరి గేయానికి మొదటి బహుమతి లభించింది. 1982 నుండి జ్యోతిర్విద్యాభ్యాసం చేసి, 1990 నుంచి వృత్తిగా కొనసాగిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో ప్రాచీన జ్యోతిషగ్రంథాల్ని అధ్యయనం చేశారు. వీరు కృష్ణమూర్తి పద్దతిని అనుసరించి చేసిన పరిశ్రమ ఫలాల్ని ఎందరికో అందించి విఫుల ఖ్యాతిని గడించారు. జ్యోతిషానికి సంబంధించి సాధారణ అంశాల్ని సులభశైలిలో వివరించి కృష్ణమూర్తి పద్ధతిలో అధ్యయనానికి కావలసిన విశేషాల్ని సోదాహరణంగా ఈ గ్రంథంలో వివరించారు. జ్యోతిష శాస్త్రాధ్యయనాన్ని సులభతరం చేసి వివరించే గ్రంథాలు లేని కొరతను తీర్చేందుకు ఈ గ్రంథ రచనకు పూనుకున్నారు. జ్యోతిర్విద్యా జిజ్ఞాసువులకు ప్రవేశద్వారంగా ఇది ఉపకరిస్తుంది.
జ్యోతిషం వాస్తు సాముద్రికం - ఇవి ఇవ్వేళ వైద్యాన్ని మించిన వ్యాపారాలై పోయాయి. రంగధాముడు ఆ దారి తొక్కలేదు. అందుకూ ఇతడంటే నాకు ఎనలేని గౌరవమూ అభిమానమూను. అంతేకాదు “విశ్వసేత్-నాతివిశ్వత్” అనే మౌలిక సూత్రానికి కట్టుబడి మార్గదర్శనం చేశాడే తప్ప పులివేషం కట్టలేదు. శాంతులూ జపాలూ వంటి అనుబంధ శాఖలు తెరవలేదు. యథాలాభ సంతుష్టితో హాయిగా శాస్త్ర కృషి సాగిస్తున్నాడు. కోట్లకు పడగలు ఎత్తక పోవచ్చుగానీ, ఈ దారిని ఎంచుకున్నందు వల్ల ఇతడు నష్టపోయిందేమీ లేదు. అధ్యయనం పెంచి అదనంగా ఇతడు లాభపడటమే కాదు, ఆ లాభాన్ని ఇదిగో ఇలా ఆ రంగంలో కృషిచేసేవారికి చేయూతగా అందిస్తున్నాడు.