మార్క్సిస్టు కళాసాహిత్య సిద్ధాంతాలు
భౌతికత్వం
మూలంలోనూ ఫలితంలోనూ భౌతికత్వమే కళల పరమ లక్షణం. బుద్ధి, దాని రూపాంతరాలు, భౌతిక పరిణామాలే. నిరంతర చలనశీలమైన ప్రపంచ పరిణామ క్రమంలోనే మనిషీ, అతని చైతన్యమూ రూపొందాయి. మానవ సమాజం ప్రకృతి అంతర్భాగమే కాబట్టి ముందుగా భౌతిక ప్రకృతిని బోధపరచుకోవాలి.
భౌతిక ప్రకృతిని బోధపరచుకోకుండా ప్రాణి చరిత్రనీ, ప్రాణి చరిత్రను బోధపరచు కోకుండా మానవ సమాజ చరిత్రనీ, మానవ సమాజ చరిత్రను బోధపరచుకోకుండా సామాజిక ఆర్థిక వ్యవస్థల చరిత్రనీ, సామాజిక ఆర్థిక వ్యవస్థల చరిత్రను బోధపరచుకోకుండా పునాది ఉపరితల నిర్మాణాంశాలనూ, పునాది ఉపరితల నిర్మాణాంశాలను బోధపరచుకోకుండా కళా సాహిత్యాలను బోధపరచుకోవడం సాధ్యం కాదు, శాస్త్రీయమూ కాదు. ఇవన్నీ ఒకే గొలుసులోని లంకెలు. ఏ ఒక్క దాన్నీ మిగతావాటి నుంచి విడిగా చూడడమనేది అధి- భౌతిక (మెటాఫిజికల్) పద్ధతి..
గతితార్కిక భౌతికవాదం ప్రకృతికి ఎలా వర్తిస్తుందో, అలాగే మానవ సమాజ చరిత్రకూ వర్తిస్తుంది. మానవ సమాజ చరిత్రకు వర్తించే గతితార్కిక భౌతికవాదాన్ని చారిత్రక భౌతిక వాదమని అంటాం. దీని దృక్కోణం నుంచే కళాసాహిత్యాది అంశాలను సరిగా బోధపరచుకునే అవకాశం కలుగుతుంది. బోధపరచుకొనేందుకు ఒక నిశ్చితమైన ప్రయోజనం ఉంది. జ్ఞానానికీ అవగాహనకు లక్ష్యం సామాజిక ఆచరణ. సామాజిక వ్యవస్థను విప్లవీకరించే దిశలోనే సామాజిక ఆచరణ సాగుతుంది.
ఏవో కొన్ని ఆదర్శాలను చోదకశక్తులుగా భావించి వాటికి అంతిమ నిర్ణాయకత్వాన్ని ఆపాదించే 'పాత' భౌతికవాదానికి భిన్నంగా, ఆ చోదకశక్తుల వెనక నిలిచే మౌలిక శక్తులను గతితార్కిక, చారిత్రక భౌతికవాదాలు ఆవిష్కరిస్తాయి. పాత్రధారుల ఆంతరంగిక చైతన్యంలో భౌతిక కారణాలే ఉద్దేశాల రూపంలో లక్ష్యాల రూపంలో పరివర్తన చెందుతాయి. చారిత్రక భౌతికవాదం వాస్తవ మానవుల చారిత్రకాభివృద్ధి శాస్త్రం.
అంతర్గత వైరుధ్యాల ఘర్షణ నిరంతరంగా సాగే క్రమంలో పదార్థం ఎప్పటికప్పుడు మార్పుకు లోనవుతూ అభివృద్ధి పొందుతుంది. ముందువైపుకే మీదిదిక్కుకే సాగినా, ఈ అభివృద్ధి సాఫీగా సరళరేఖలో లాగా సూటిగా సాగదు. ఊర్ధ్వ దిశలో చుట్లు చుట్లుగా (స్పైరల్స్) సాగుతుంది. స్థల, కాలాలలో చలనం చెందే పదార్థం తప్ప తక్కినది ఏదీ ఈ ప్రపంచంలో లేదు. పదార్థ బాహిరంగా ఏ ప్రేరణా ఉండదు. అప చైతన్యంవల్ల పదార్థ స్వయం ప్రేరణను ఏ భగవంతుడితో ఆపాదించడం జరుగుతుంది. నిజానికి, స్వయంప్రేరణే పదార్థ పరిణామానికి మూలం...............