మూల్గినక్కమీద తాటికాయ
నిన్నగాక మొన్ననేగదా. అనేక జీవితావసర వస్తువుల ధరలు మిన్నుముట్టడం. చూసాం. అంతటితో తీరిపోయిందని బరువుగా, నొప్పిగా, దీర్ఘంగా నిశ్వసించి, పరమాత్ముడిమీద భారంవేసి మన నిస్సహాయత, అశక్తత, నిర్వీర్యత ప్రదర్శించుకున్నాం. ఈ వరకు జనం గుండెలు రాళ్ళుచేసుకుని వుంటారనే దుశ్చింతలో మొన్న వంకాయ దొంగిలిపోయిన ప్రభుత్వం యీవేళ టెంకాయ దొంగతనానికి కూడా సాహసం చేసింది. ఈ లోగా అదను కోసం పడిగాపులు కాస్తుండిన ప్రముఖ గుడ్డ ఉత్పత్తిదారులు ప్రభుత్వాన్ని ఒప్పించి గుడ్డల ధరలను నూటికి మూడు నుంచి ముప్పై ఐదువరకు పెంచారు. ఈ ధరల పెంపుదల సాధించినంతవరకూ గుడ్డ లేదని చెబుతూ కృత్రిమమైన గుడ్డ కరువు కల్పించారు. ఆ తరువాత ప్రభుత్వం మరికొన్ని వస్తువుల ధరలు పెంచింది. ఈసారి పోస్టల్ శాఖ రంగంలోకి వచ్చింది. ఈ శాఖ ప్రజోపయోగార్థం అయినప్పటికీ వ్యాపార సంస్థ అని నేటికి రుజువు చేసుకుంది. మేము పోస్టాఫీసులను చాలా చోట్ల నెలకొల్పాం. ఆ సిబ్బందిని పోషించేందుకు అయ్యే ఖర్చు నష్టాన్ని ధరల రూపంలో కాక మరి యెలా తీర్చుకోగలం అని ఆ శాఖ మంత్రి సమర్థించాడు. కాని ఈ మంత్రిపుంగవులు తెలుసుకోవలసిన దేమిటంటే, ఈ వస్తువులు ఖరీదులను ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ అమ్ముడు అవుతాయని. ఖరీదుల కోత వల్ల కలిగే లోటును ఎక్కువ అమ్ముళ్ళ వల్ల వచ్చే కాసులు పూడ్చడమేకాక, కొంత మిగులుతుందనీ, మనియార్డర్లమీద, రిజస్టర్ జాబులుమీద రుసుముల పెంపుకంటే, పూర్వం వుండిన ఏర్- మెయిల్ రేట్లను తిరిగి అమలు పెట్టితే మంచిది.
మధ్య ప్రాచ్యంలో అమెరికా జోక్యం :
పర్షియాను యీ మధ్య విశ్వదృష్టిలోకి ఈడ్చిన నూనె రాజకీయాలు చల్లారలేదు. జనరల్ రజ్మారా (పర్షియా ప్రధాని)ను హత్యచేసినవాని స్వారస్యపు తాడు వాషింగ్టన్ నగరంలో వుందని లోకం అంతటికీ తెలుసు. పర్షియా నూనె గనులను ముట్టించిన నిప్పురవ్వ కొరియా యుద్ధ రంగంలో ఉత్పన్నమయిందా అనుకోవచ్చు. న్యాయంగా ఇందులో బ్రిటీష్................