నా మాట
నేటి బాలలే భావిపౌరులు. ఇది సహజం. అయితే అతను సమాజానికి కొంతయినా ఉపయోగపడాలి. మంచి పౌరుడిగా ఎదిగి దేశాభ్యున్నతికి కొంతయినా పాటుపడాలి. అప్పుడే అతని జన్మకు సార్థకత చేకూరుతుంది. అహింసావాదులు, శాంతిదూతలు, తత్త్వవేత్తలు, పరాక్రమవంతులు యిలా ఎందరో మహానుభావులు మనదేశంలో అవతరించారు. వారి ఉన్నత భావాలను కొన్నయినా పౌరుడిగా నిజ జీవితంలో ఆచరించే విధంగా బాల్యంలోనే వారి జీవితచరిత్రలు బాలలచేత చదివించాలి. అధ్యయనం చేయించాలి. ఈ బాధ్యత పెద్దల పైనే ఉంది. మహాత్మాగాంధీ, పండిత నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రకేసరి
ప్రకాశం పంతులు, అల్లూరి వంటి మహా పురుషులు ఎందరో ఉన్నారు. దేశం కోసం నిస్వార్థంగా సేవలందించారు. ఆ కోవకు చెందినవాడే స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి. అతని జీవితచరిత్ర నేటి బాలలకు నిజంగా ఆదర్శప్రాయం. |
అతి పేద కుటుంబంలో పుట్టి, పట్టుదలే పెట్టుబడిగా, ఆత్మసైర్యమే ఆయుధంగా, అణగారిన ప్రజల జీవితాలకు ఆశాజ్యోతిగా మెలగి, అంచెలంచె లుగా ఎదిగి, విశాల భారత దేశానికి ప్రధాని పదవి నలంకరించిన లాల్ బహదూర్ శాస్త్రి అంటే నాకు అమితమయిన అభిమానం. వేషధారణ, శరీర దారుఢ్యం,
అందచందాలు ఇవేవీ మనిషి యొక్క వ్యక్తిత్వానికి కొలమానం కావని, గుణగణాలు, సత్శీలత, నిరాడంబరతే వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తాయని చాటి చెప్పిన నిరాడంబర జీవి శ్రీ శాస్త్రీజీ. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సేకరించి నాకు చేతనయిన విధంగా రేపటి పౌరులుగా మారవలసిన నేటి బాలలకు తెలియజేయడానికే ఈ రచన. ఈ నా ప్రయత్నం కొంతయినా సత్ఫలితాన్నిస్తే నా కృషికి సార్థకత చేకూరినట్టేనని భావిస్తాను..........