చిత్రకళా జగద్విరించి
లియొనార్డో ద వించీ
ప్రొ. వి. శ్రీనివాస చక్రవర్తి
లియొనార్డో ద వించీ అంటే వించీకి చెందిన లియొనార్డో అని అర్థం. వించీ అనేది ఇటలీలో టస్కనీ అనే ప్రాంతానికి చెందిన ఒక గ్రామం. సొంతూరి పేరుని ఇంటిపేరుగా తీసుకునే ఆచారం మన దేశంలో, ముఖ్యంగా తెలుగునాట, బాగా చలామణిలో ఉంది. ఇటలీలో కూడా ఆ ఆనవాయితీ వుంది.
భావి మేధావి, యూరప్లో సాంస్కృతిక పునరద్దీపనకి మూలపురుషుడు అయిన లియొనార్డో టస్కనీ ప్రాంతంలో జన్మించడం విశేషం. టస్కనీకి రాజధాని నగరం అయిన ఫ్లోరెన్స్ యూరప్ అప్పుడప్పుడే రాజుకుంటున్న సాంస్కృతిక విప్లవాగ్నినికి కేంద్రస్థానం. ఆ విప్లవంలో ముఖ్య పాత్ర పోషించిన ఎందరో మహానుభావులని ఫ్లోరెన్స్ నగరం తల్లిలా అక్కున జేర్చుకుని పోషించింది. లియొనార్డో విషయంలో కూడా ఫ్లోరెన్స్ నగరం ఎనలేని మేలు చేయడం ముందుముందు చూస్తాము. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే అతడు జీవించిన సామాజిక పరిస్థితుల ప్రభావం ఎంత ముఖ్యమో లియొనార్డో విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.
వించీ గ్రామం ఇటలీలో ఇప్పుడు ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. కాని క్రీశ 1452లో, అంటే లియొనార్డో జన్మించిన కాలంలో, అది ఏ విశేషమూ లేని కుగ్రామం. వించీ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో లియొనార్డో పుట్టిన ఇల్లు, ఓ చిట్టి పెంకుటిల్లు ఇప్పటికీ వుంది. గ్రామస్థులు దాన్ని Casa Natale di Leonardo (లియొనార్డో పుట్టినిల్లు) అని పిలుచుకుంటారు...............