కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడంకన్నా, కొత్తకొత ప్రదేశాలను చూడటమంటే నాకు మక్కువ ఎక్కువ. ఆ యిష్టంతోనే ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రదేశాలన్నీ చూడగలిగాను. 2015 తర్వాత దాదాపు ప్రతిసంవత్సరమూ లండన్లో ఐదారు నెలలు పిల్లలతో గడిపిరావడం పరిపాటైంది. తిరిగేకాలు ఒకచోట నిలవదుకదా! వారాంతాలలో ఆటవిడుపుగా వీలైనప్పుడు అందరమూ, కానప్పుడు శ్రీమతీ, నేనూ, అదీ వీలు కానప్పుడు ఒక్కడినే లండన్ లోపలా వెలుపలా సమీపంలోని ప్రదేశాలను చూడగలిగాము. ఆ క్రమంలో అక్కడి మ్యూజియాలూ, పార్కులూ, ఆర్డు ఎగ్జిబిషన్లూ, స్టూడియోలూ, మాన్యుమెంట్లు, హిందూ దేవాలయాలు, సినిమాలు, నాటకాలు చూడటానికి మంచి అవకాశం దొరికింది. మౌప్ నాటకం, గ్లోబ్ థియేటర్లో షేక్ స్పియర్ నాటకాలూ అలా చూసినవే!
ట్రావల్, ట్రావలాగ్ పట్ల గల అభిరుచి, తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవాలన్న కోరికకు అక్షరరూపమే ఈ పుస్తకం. లండన్ పర్యటనలో మన తెలుగువారికి, లండన్ గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహవంతులకు ఏమాత్రం ఉపయోగపడినా పుస్తక ప్రయోజనం సిద్ధించినట్లే భావిస్తాను.
టి.వి. ప్రసాద్