ఒక్కమాట
మా అత్త)మ్మ తన చిన్నప్పట్నుంచీ మమ్మల్ని వదిలి వెళ్ళేవరకు ఒక రాణిలాగే బ్రతికారు. మొఖంలో రాజసమే కాదు, మనిషి స్వభావం కూడా అంతే. ఆధిపత్యం చలాయించినా, దయగల వ్యక్తి. ఎప్పుడూ ధర్మం పాటించాలి, నిజం చెప్పాలి, దేనికీ భయపడకూడదు అని పిల్లలకి సూత్రాలు నేర్పించిన క్రమశిక్షణగల వ్యక్తి.
అందరికీ తనలాగా చెల్లకపోవచ్చు, కానీ చెల్లించుకున్నారు... నాన్న దగ్గర, భర్త దగ్గర, పిల్లలు, ఇంటికి వచ్చిన కోడళ్ళు, అల్లుడుతో సహా, ఆమె మాట జవదాటేవారే లేరు. ఎవరికైనా 'అల్టిమేటం' ఇవ్వగలిగే పవర్ఫుల్డీ.
అత్తమ్మ ఎవరిని తిట్టనక్కర్లేదు, ఒక కంటిచూపు చాలు... తల దించాల్సిందే... కనపడితే చాలు, ఎలాంటి శత్రువు అయినా నమస్కారం పెట్టేస్తారు... అటువంటి వ్యక్తిత్వం ఆమెది. ఎవరయినా లేచి గౌరవం ఇస్తారు.
చేనేత చీరలు మాత్రమే కట్టుకుంటారు... గుడికి వెళ్లేటప్పుడు, వేడుకలకి కంచిపట్టు, పోచంపల్లి నేత చీరలు. ఇంట్లో ఖాదీ మరియు వాయిల్ చీరలు. రాత్రిపూట బొబ్బిలిచీరలు కట్టేవారు.
మంచిగా ఉంటే, పక్కనే కూర్చొని పద్దతిగా చెబుతారు. కోపం వస్తే, చిటిక వేసి 'విషయం ఏంటి' అని అడిగే స్టైల్.
చిన్నప్పుడు తోబుట్టువులతోకానీ, చదివే సమయంలో మిత్రులతోకానీ, కుటుంబంలోకానీ, పిల్లలని పెంచడంలోకానీ, పదునుగా ఆలోచించే తత్వంలో కానీ, 'నో' అని ధైర్యంగా చెప్పే శైలికాని, తనకు తానే సాటి....................