బాల్యం, పరిసరాలు, ప్రభావాలు
జీవిత చరిత్ర రచనల్లో జననం, కుటుంబం, చిన్నప్పటి అనుభవాలు, చదువుల తొలి అడుగులు, ఇవన్నీ చెప్పుకొంటూ పోవడం ఆనవాయితీ. కారణం, ఈ వివరాలు ఆ తరవాత వారివారి జీవితాల్లో ఏవైనా ప్రభావాలు కలిగించాయా అని గ్రహించడం ఒకటైతే, మరొకటి, అప్పటి సమాజం, దాని తీరుతెన్నులు స్థూలంగా తెలుస్తాయి. ఈ నేపథ్యం ఆయా వ్యక్తుల జీవితాల మూలాలు తెలియజేయటమేకాక, ఆ కాలపు సంస్కృతి, జీవనశైలి జీవిత చరిత్రకారులకే కాదు, విశాలార్థంలో చరిత్రకారులకూ ఉపకరిస్తుంది.
కెవిఆర్ చిన్నప్పటి విశేషాలు ఆయనే స్వయంగా కొన్ని పుటల్లో 'రన్నింగ్ కామెంటరీ'లాగా, వ్యాస శకలాల రూపంగా రాసుకొన్నారు. ఈ అధ్యాయానికి అదే ప్రధాన ఆధారం. వివాహానంతరం ఎన్నేళ్ళకో, దాదాపు జీవిత చరమాంకంలో కెవిఆర్ బహిర్ ప్రాణం, జీవితభాగస్వామి శారదాంబగారు రాసిపెట్టుకొన్న కొద్ది సంగతులు, లలితతో, నాతో అప్పుడప్పుడూ పంచుకొన్న జ్ఞాపకాలు, ఈ అధ్యాయానికి ఆధారాలు.
కెవిఆర్ జననం 1928 మార్చి 23, నెల్లూరు జిల్లా, కోవూరు తాలుకా, రేబాల గ్రామంలో. పెన్నానది ఆనకట్ట ఆయకట్టులోని గ్రామం. సారవంతమైన భూమి. నీటికొరత లేకపోవడంతో క్రమం తప్పకుండా పండే పంటభూములు. పంటరెడ్లు ప్రధానంగా వుంటూ, గ్రామసముదాయంలో వుండే మిగతా సేవా కులాలు, బెజవాడ వంశపు రాజకీయ ప్రముఖులు కేంద్రం అయిన బుచ్చిరెడ్డిపాళెం పక్కనే రేబాల.
ఇంటిపేరు 'కనుపూరు”. “చిన్నప్పటి నుంచీ కనుపూరు అనే ఇంటిపేరు విన్నప్పుడల్లా కాన్పూర్ అనిపించేది. ఈ కనుపూరు, వెంకటాచల సత్రం, కసుమూరుల మధ్యలో వుంది... ఎప్పుడు కనుపూరు విడిచారో తెలియదుగాని, మా తాతల హయాంనాటికి పొట్టపాళెం నివాస స్థలం. అక్కడ నుంచి రేబాలకు వచ్చినట్టున్నది. మధ్యలో కొమ్మరపూడికి పోయారేమో? అక్కడ బందిపోటు దొంగల (పిండారీలా?) బెడద వుండేదట." ఇంకా, కెవిఆర్ మాటల్లో-
"రేబాల అనే పేరు ఎలా వచ్చినట్టు? రే+బాల అని తప్పుడు సమాసమొకటి చేసుకుని చాలా అందమైన పేరని నాలోనేను మురుసుకొనేవాణ్ణి. యూనివర్శిటీలో చదివే రోజుల్లోనూ, ఆ తరువాతనూ సాహిత్య ప్రియులైన మిత్రులు కూడా ఈ పేరు వినగానే శృంగారవతి ఎవరో స్పృశించినట్టుగా మా బాగుందనేవారు.”
"రేబాలలో మా అమ్మావాళ్ళది 'బత్తల' వాళ్ళ కుటుంబం. ఈనాటికీ మమ్మల్ని.....................