మా పలకల | పురం
నాకు ఐదేళ్ళ వయసున్నప్పుడు మార్కాపురంలో కాలుపెట్టాను. అప్పటి నుంచీ నాకన్నీ గుర్తే. ఆ గుర్తులే ఈ కథలు వ్రాయడానికి నాకు ప్రేరణనిచ్చాయి. మార్కాపురం నాకు సొంత ఊరు కాదు. కానీ మనసంతా నింపుకున్న ఊరు. అంటే సొంత ఊరి కంటే ఇంకా ఎక్కువే కదా! ఎవరికైనా బాల్యం ఎక్కడ గడిపితే అదే సొంత ఊరు. జీవితంలో ఎప్పుడైనా మనసులో బాధ కలిగినపుడు సొంత ఊరు గుర్తుకు వస్తుంది. ఆనందం కలిగినపుడు కూడా సొంత ఊరే గుర్తొస్తుంది. దుఃఖం కలిగినపుడు కూడా సొంత ఊరే గుర్తుకువస్తుంది. నాకైతే ఆ ఊళ్ళో కూర్చొని ఏడుస్తున్నట్లు, నవ్వుతున్నట్లు, ఏవో జరిగినట్లు, చక్కిలిగింత పెట్టినట్లు ఇంకా ఏవేవో ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇంతకీ నేను మార్కాపురం ఎందుకు వెళ్ళానో తెలుసా? అబ్బో! అదంతా ఓ కథ చెబుతా వినండి.
నాకు ముగ్గురు మేనమామలు. పెద్ద మామయ్య, చిన్న మామయ్య, బుజ్జి మామయ్య. అలా పిలవమని మా అమ్మ చెప్పింది. మా అమ్మ తరువాత చివరివాడు బుజ్జి మామయ్య. నేను అలానే పిలిచేవాణ్ణి. పెద్ద మామయ్య నన్ను ముద్దుగా దగ్గర పండుకోబెట్టుకొని ముద్దు ముద్దుగా పిట్ట కథలు చెప్పటం లీలగా గుర్తుంది. అప్పుడు మేము నరసరావుపేటలో ఉండేవాళ్ళం. నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి పైనుంచి చాక్లెట్ పడేసి, పిట్ట చాక్లెట్ ఇచ్చిందని చెప్పేవాడు. నా నాలుగేళ్ళ మనసు నిజంగానే నమ్మేసి కల్మషం లేకుండా నవ్వింది. నాకు నాలుగేళ్ళ వయస్సున్నప్పుడు క్షయ వ్యాధితో ఆయన చనిపోయాడు. అంతకు ముందు మూడు నెలల క్రితం తాతయ్య చనిపోయాడు. ఇక అమ్మమ్మకు, బుజ్జిమామయ్యకు చిన్నమామయ్యే ఆధారమయ్యాడు. అప్పుడు చిన్న మామయ్య మార్కాపురం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగంలో చేరాడు. ఇదీ మా అమ్మమ్మ పుట్టింటి వాళ్ళ పరిస్థితి..................