మేడం...C
అద్యాయం - 1
2001 ఫిబ్రవరి మాసం...
చెన్నై మెరీనా బీచ్... సాయంత్రం 4:30 కావస్తోంది. అప్పటికే ఆ ప్రాంతం జనాలతో కిటకిటలాడిపోతోంది. ఎగసిపడే అలల సౌందర్యాన్ని తిలకించేందుకు కొందరు.. ఆ ఉవ్వెత్తున ఎగిసే అలలతో సయ్యాటలాడేందుకు కొందరు... రొటీన్ కు భిన్నంగా తమ పిల్లల కేరింతలు చూద్దాం అని వచ్చిన తల్లిదండ్రులు కొందరు..
అందమైన అమ్మాయిలకు సైట్ వేద్దామని వచ్చిన పోకిరి పిల్లగాండ్లు కొందరు.. అసాంఘిక, అనైతిక కార్యకలాపాల కోసం మరికొందరు.. వేలాది జనంలో ఎవరెవరు ఎందుకు వచ్చారో..!
ఆ వేలాదిలో మహిమ కూడా ఒకరు. ఆమె మాత్రం సంధ్యా వేళలో సంద్రపు సంగీతాన్ని వినేందుకే వస్తుంది.
ఆ సంగీతం ఎవరి గొంతు నుంచో వచ్చేది కాదు. సముద్రుడు స్వయంగా నోరు తెరిచి వినిపించే మంద్ర గీతం అది. పడి లేచే కడలి తరంగాల నుంచి ఒక సుమధుర సంగీతాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. మహిమకు మాత్రమే వినిపించే సుస్వర రాగం అది. సాయంసంధ్యలో కడలిఘోష నుంచి అలవోకగా జాలువారే గమకాలను ఆస్వాదించేందుకు ఆమె ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అక్కడికి వస్తుంది.
బిజినెస్ పనుల్లో వారమంతా అలసి సొలసిన తన మనసుకు ఇక్కడ ఈ అలల సవ్వడిలో మాత్రమే సాంత్వన దొరుకుతుంది.
పార్కింగ్ స్థలంలో తన శాంట్రో కారును పార్క్ చేసి అలవాటుగా దక్షిణ వైపుకు అడుగులు వేసింది. జనాలు పూర్తిగా పలుచబడిన ప్రాంతం అది. సర్వీ పొదలు చిక్కగా ఉన్నాయి. ఇసుకలో ఎత్తుగా పెరిగిన సర్వి చెట్టుకు ఆనుకునే ఒక నాటు పడవ ఉంది. అది ఎప్పటినుంచో పనికిరాకుండా అక్కడే పడి ఉంది. దాని పైకి ఎక్కి అడ్డంగా.....................