దళిత తాత్వికతకు మేనిఫెస్టో నగేష్ బాబు కవిత్వం
- జి. లక్ష్మీనరసయ్య
నగేష్ బాబును తన కవిత్వం నుంచి వేరుచేసి చూడలేం. అలాగే తన కవిత్వాన్ని తన వ్యక్తిత్వం నుంచి విడిగా చూడలేం. నగేష్ కవిత్వాన్ని చూస్తే అతను పీడిత కుల ప్రజల తరుపున యుద్ధం చేయటానికి రాశాడని స్పష్టంగా తెలుస్తుంది. చాలామంది కవులు, దళిత కవులు కూడా, ఏమి రాస్తే, ఏ మోతాదులో రాస్తే తమ గౌరవానికి భంగం లేదో అదే రాశారు. ఆ మోతాదుకే పరిమిత మయ్యారు. నగేష్ ఆ పని చెయ్యలేదు. ఏటికి ఎదురీదాడు. ఒక ఉద్యమంలో భాగమవ్వటమే కాకుండా తనే ఒక ఉద్యమ ప్రభంజనమై దళిత కవిత్వం రాశాడు. “గాలికెదురుగా ఉచ్చ పోస్తే నీకే నష్టం” అని మర్యాదస్తులు అంటున్న రోజుల్లో ఇది మురికి గాలి, దీని మీద పోయాల్సిందే అనేవాడు. అందుకే 'భగవద్గీత కన్నా కల్లుగీత మిన్న' అని ప్రకటించగలిగాడు. దళిత కవిత్వం కవిత్వమేనా అని కొంతమంది కుట్ర పూరితంగా మాట్లాడుతు న్నప్పుడు, 'కవిత్వానికి నిర్వచనాలు తిరగ రాశాం రా! బాబు!' అని సగర్వంగా చెప్పాడు.
నగేష్ బాబుతో కలిసి పనిచేసిన అందరికీ ముందుగా గుర్తొచ్చేది అతని నిజాయితీ, కాజ్ పట్ల తొణకని కమిట్మెంట్. ప్రేమగా, కటువుగా, నిర్మొహ................