నొప్పుల నూకాలల్లి
(రు. 10,000/- లు బహుమతి పొందిన హాస్య కథ)
జీవితంలో మనిషికి ఎదురయ్యే అష్టకష్టాల జాబితోపాటు చివరగా తొమ్మిదో కష్టం కింద వెన్నునొప్పిని కూడా జత చేయాలని ఈ మధ్యనే నాకు అర్థమైంది. కారణం, మా ఆవిడకి వెన్నునొప్పి పట్టుకుని దినదిన ప్రవర్థమానమవటమే!
ఆ బాధ తట్టుకోలేక “ఇలా అయితే ఎలాగండీ?... ఓ టీచరుగా క్లాసులో నిలబడి పాఠాలు చెప్పుకోవాలి కదా..." అంటూ తన బాధ నిత్యమూ నాతో పంచుకుంటూనే వుంది. “స్కూలుకి ఆటోలో వెళ్ళి వస్తున్నావు కదా... సూరిబాబుని ఆటో కాస్త మెల్లిగా తోలమని చెప్పు" అన్నాను, ఎలా సర్దిచెప్పాలో తోచక.
"ఆటోలో కూర్చున్నంతసేపూ మరింత నొప్పిగా వుంటోంది. అయినా ఏం చేస్తాం?... నాకు బండి తొక్కడం రాదుకదా... తొందరలో ఎవరైనా మంచి డాక్టరు దగ్గరకు వెళ్ళాలి" అంది.
డాక్టరు దగ్గరకు వెళ్ళడం అంటేనే మా ఆవిడకి చచ్చేంత భయం! ఇంజెక్షన్ తీసుకోవటానికి కూడా వెర్రికేకలు పెట్టేస్తుంది. తన చిన్నతనంలో ఇంజక్షన్ చేస్తున్న డాక్టర్ చేతిని కరిచేసిన ఉదంతం, ఓసారి నాకుచెప్పింది కూడాను!
ఇప్పుడు అలాంటిది ఏదైనా జరిగితే, లేనిపోని క్రిమినల్ కేసులో ఇరుక్కోవాలి! అందువలన నాకై నేను, డాక్టర్ దగ్గరకు వెళ్లామని మా ఆవిడకి ఎన్నడూ సలహా చెప్పను. ఆ మాట మా ఆవిడ నోటంట రావడం కోసమే, నేను ఇంతకాలంగా ఎదురుచూస్తున్నాను. ఆదృష్టంకొద్దీ మర్నాడు ఉదయం పదిగంటలకు ఆర్థోపెడీషియన్, డాక్టర్. కపాలేశ్వరరావుగారి అపాయింట్మెంట్ దొరికింది. మా ఆవిడ పొద్దుట తొమ్మిది గంటల నుండీ తొమ్మిదిన్నరలోగా నాలుగు చీరలు మార్చింది. చివరకు నెమలీకల డిజైన్తో వున్న ఓ ముదురు ఎరుపురంగు పట్టుచీర చుట్టబెట్టుకుని "ఇది బాగుందా?" అనడిగింది......................