శ్రీయజ్ఞవరాహరూపమున శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించి వేయుటచే వాని అన్నయగు హిరణ్య కశిపుడు తమ్ముని చంపిన పగ దీర్చుకొనవలయునని దీక్ష వహించెను. పిదప ఆతడు తన తమ్ముని నిమిత్తము వగలం బొగులుచున్న వారినెల్లర నూరడించి, తనకు ముసలితనము చావు దుస్సాధ్యుడైన వైరియు లేకుండునట్లును, ముల్లోకములను శాసించు శక్తియు, యుద్ధరంగములయందు సంతతవిజయము, సింహపరాక్రమమును గలుగునట్లును వరములను సంపాదింపగోరి, మందర పర్వతమున కరిగి, యొంటికాలి బొటనవ్రేలిమీద నిలిచి, యూర్ధ్వబాహుడై, ఆకసము చూచుచు బ్రహ్మదేవుని గుఱించి ఘోర తపస్సు ప్రారంభించెను. నిశ్చలతపస్సమాధి నిష్టాగరిష్టుడైన యారాక్షసునిపై పుట్టలు మొలిచెను. చెదలు మున్నగు పురుగులచే శరీర మంతయు జీర్ణించెను .
చారులచే వాని తపోవృత్తాంతము దేవేంద్రునకు వినవచ్చెను. హిరణ్యకశిపుడు తపస్సునకు వెడలకపూర్వమే ఆతని భార్య లీలావతికి గర్భోత్పత్తి అయ్యెను. దేవేంద్రుడు అదాటున రాక్షసపురిపై దండు విడిసి రాక్షసులను జించి చెండాడి లీలావతిని చెఱపట్టి స్వర్గపురమునకు బయలుదేతెను. మార్గమధ్యమున నారదుడు వచ్చి కలుసుకొని, హిరణ్యకశిపుడు మృతిచెందలేదని చెప్పి, లీలావతి గర్భముననున్న బాలుడు దేవతల నుడు క్రూరుడుగాక శ్రీమన్నారాయణుని భక్తాగ్రేసరచక్రవర్తియని యెరింగించి, లీలావతిని విడిపించి తన ఆశ్రమమునకు గొనిపోయెను. అచ్చట నారదుడు లీలావతి కుపదేశించు నెపమున నామె గర్భముననున్న బాలునకు శ్రీమహావిష్ణుభక్తిత్వమును ఆమూలాగ్రముగా వుపదేశించెను. బాలుడంతయు నూకొట్టి అవగాహనము చేసుకొనెను.
అచట హిరణ్యకశిపుని తపోవహ్నికి తాళజాలక సప్తకులపర్వతములతో భూమి గడగడ వణకెను. సప్తసముద్రములును కలిగిపోయెను. గ్రహములతో గూడ నక్షత్రములు చెదరిపోయెను. దిక్కులు మండిపోయెను. జంతువులన్నియు గుండెబెదురు వలన భయకంపితము లయ్యెను. దేవతలకు మీది ప్రాణములు మీది కెగిరిపోయెను. అంతకంతకు దేవేంద్రుని భీతి పెరిగిపోయెను. ఇక జేయునదిలేక సురలెల్లరును బ్రహ్మదేవుని చెంతకు బోయి, "దేవదేవా! దితి కుమారుడగు హిరణ్యకశిపుని తపస్సు వేడిమివలన మాడిపోవుచున్నాము. దైతేయ తపోగ్ని కీలావృతమైన స్వర్గపట్టణములో క నుండజాలము సురజ్యేష్ఠా! మూడులోకములను జయించుటకును, దేవతల నెల్లరను