మహాశిల్పి మైకెలేంజిలో
కర్నాటక సంగీతానికి త్రిమూర్తులుగా త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రుల పేర్లు చెప్పుకున్నట్టే, ప్రధాన పునరుద్దీపన (high renaissance) యుగానికి చెందిన మహామహులలో త్రిమూర్తులుగా ముగ్గురు పేర్లు ప్రస్తావిస్తారు. వారిలో మొదటి వాడు లియొనార్డో ద వించీ. రెండవ వ్యక్తి మైకెలేంజిలో. లియొనార్డో తరువాత ద్వితీయ స్థానం మైకెలేంజిలోకి దక్కుతుందంటే చాలా మంది చారిత్రకులు సమ్మతించరు. లియొనార్డో, మైకెలేంజిలోలు హేమాహేమీలు అని కొందరు భావిస్తే, అసలు పునరుద్దీపన యుగానికి మైకెలేంజిలో రారాజు అని కొందరు అభిప్రాయపడతారు. అసలు పాశ్చాత్య చిత్రకళా సాంప్రదాయంలోనే మైకెలేంజిలోని మించిన వారు లేరని చాటిన వారు కూడా వున్నారు. చిత్రకళ మాత్రమే కాక, శిల్పకళ, స్థాపత్య కళ, కవిత్వం - ఇలా ఎన్నో రంగాల్లో అసమానమైన బహుముఖ ప్రజ్ఞాశాలి మైకెలేంజిలో,
మైకెలేంజిలో పుట్టిన తేదీ మార్చ్ 6, 1475. ఎందరో ఇతర ఇటాలియన్ కళాకారులకి మల్లె మైకెలేంజిలోకి కూడా అందమైన టస్కనీ ప్రాంతమే పుట్టినిల్లు. ఆ ప్రాంతానికి చెందిన కాపీస్ అనే గ్రామానికి మైకెలేంజిలో తండ్రి ఊరి పెద్ద లాంటివాడు. మిచెలాన్యోలో దిలుడొవికో బువనరొటీ సిమోని అనే భారీ పేరుతో పసిపిల్లవాడికి ఇటాలియన్లో నామకరణం చేశారు. ఆంగ్ల ప్రపంచంలో ఆ బారైన పేరు కాస్తా వట్టి మైకెలేంజిలో గా కుదించబడింది................