ఈ ఆధ్యాత్మిక కావ్యం జీవన్ముక్తుని యొక్క స్వరూపస్థితికే కాక, తనకు తానే చూపరి అయిన జ్ఞాని యొక్క అహం స్ఫురణ రూప వ్యావహారిక జీవన పద్ధతికి కూడా అద్దం పడుతూ, రసగుళికల వంటి వాక్యములతో నిండి ఉండి, సుధలొలికే, “కమ్మ తావి గుబాళించు తమ్మికొలను.”
- దోనెపూడి వెంకయ్య
'మనఏవమనుష్యాణాం కారణంబంధ మోక్షయో!' - అన్న సూత్రాన్ని కరదీపికగా నిలుపుకొని జీవితాన్ని పండించుకొని, అనేకమేకమనే అద్వైత స్థితిని చేరుకునేందుకు, మనసును ఎవర్ రెస్ట్ కోసం, ఎవరెస్టు శిఖరానికి ఎక్కించే సాధక ప్రేరణను ఇస్తుంది ఈ కావ్యం. ఇందులోని కవితాగంగ సాధకుని అవసరాల్ని ఎరిగి తీర్చే అమ్మ,
- ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు
ఋగ్వేదంలోని నాసదీయసూక్తం సదసత్తులకు అతీతమైన స్థితిని వర్ణిస్తుంది. అదే మహామౌనం. ఆ మహామౌన స్థితికి చేరుకోవటమెలాగో చెబుతుందీ మహామౌనకావ్యం భీతియే మరణం/ శరీరంలో మనస్సుకు, భయానికి | భీకరసౌధం కట్టించి ఇస్తే / అది అధికారం చెలాయించక ఏం చేస్తుంది?...
ఈ భయాన్ని వీడి మహామౌనరూపమైన ఘనీభవానంద సాగరానికి పయనించే స్థితిని మహామౌనం మనోహరంగా అందించి అలరిస్తుంది. భావలయతో సంగమించిన సరళ సాధికార శైలి, పాఠకుణ్ణి తనతో నడిపిస్తుంది. ఆనందఘనీభవస్థాయికి చేర్చే ఒక విశిష్ట కావ్యం ఈ మహామౌనం. భావద్రష్ట, కావ్య స్రష్ట అయిన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారి సాధనారూప తపఃఫలం ఈ కావ్యం