బతికిన వాక్యం
జీవితం ఒక వల విసిరి, చిక్కుకుంటావు. పాదాల ముందర సముద్రం మోకరిల్లితే వినయం. లొంగుబాటు కాదు. గర్జిస్తే సునామి. అదే అసలు ముఖం.
నీతో వచ్చిన వాళ్లెవరూ వుండరు. ఉండాలనుకున్నా నువ్వు వుండలేవు. జాతర కలకాలం వుండదు. ఒకరోజు సంబరం మాత్రమే. ఎన్నడూ చూడని, ఎక్కడికి వెళుతుందో తెలియని రహదారిలో ప్రయాణించు. జీవితం కొత్త పుస్తకంలా వుంటుంది.
కీచురాయికి రాత్రి మాత్రమే తెలుసు. పగలు భరించలేదు. కనురెప్పల పరదాలు ఎత్తిన ప్రతిసారీ కొత్త నాటకం. హారర్ సినిమా ఎక్కడో వుండదు. అద్దంలో మనల్ని చూసుకోడమే.
ఒంటరితనం ఒక భ్రాంతి. నిన్ను అనేక కళ్లు చూస్తూనే వుంటాయి. ఒక సీతాకోక చిలుక భుజాల మీద ఎగురుతుంది. లేదా పొదల్లోంచి ఒక పులి ఎదురు చూస్తూ వుంటుంది.
కొత్త సంవత్సరం ఏదో ఇస్తుందని ఆశ పడకు. ఏమీ తీసుకుపోకుండా వుంటే చాలు. సాగరానికి విశ్వాసంగా వుండు. అది ఇచ్చే ఉప్పు తినే చచ్చే వరకూ బతుకుతావు.
సాహిత్యం తగ్గి పీఠాధిపతులు పెరిగారు. రాసేవాళ్ల కంటే మోసేవాళ్లు ఎక్కువయ్యారు. ఎక్కడ చూసినా చిడతల భజన. డోలు విద్వాంసులు తొక్కిసలాట. అబద్ధాల్ని ఆశ్రయించి, సత్యాన్ని అన్వేషించడం ఆధునిక కళ. మొత్తం మేకప్. కడుక్కుంటే ఎవన్ని వాడే గుర్తు పట్టలేడు. ఒకన్ని నలుగురు సూపర్వైజ్ చేస్తే హెచ్ఐర్ స్కిల్స్. నలుగురి పనిని ఒకనితో చేయిస్తే ప్రాజెక్ట్ వర్క్. ఎలక్ట్రిషియన్ పనిని ప్లంబర్తో లాగిస్తే అది మేనేజ్మెంట్ టెక్నిక్....................