మేకింగ్ ఆఫ్ ఏ రైటర్
ప్రారంభానికి ముందు....
ఈ రచన మేధావుల కోసం ఎంత మాత్రం కాదు. ఇప్పుడిప్పుడే రచనలు చేస్తున్న వారికి... చేయాలనుకుంటున్న వారికి.. అలాగే జీవితంలోకి అడుగులు వేస్తున్న వారికి. ఇందులో రచనలు, కళలు మాత్రమే కాదు. అనేక అంశాలు మధ్యలో వస్తుంటాయి. నేను పుట్టుకతో రచయితను కాదు. నేను రచయితగా మారాను. నన్ను మా కుటుంబం... ప్రజలు... గురువులు.. సమాజం రచయితగా తీర్చిదిద్దింది.. తీర్చిదిద్దుతూనే వుంది.
ఇది నా జీవిత కథ కాదు. నా జీవితంలో అనేక అనుభవాలను, సంఘటనల్ని ఇంతకు ముందు కొన్ని నవలల్లోనూ, కథల్లోనూ రాశాను. అయినా నేను చెప్పనివి వున్నాయి. చెప్పే కోణం కూడా ముఖ్యం. కథ-నవలల్లో వాస్తవం, కల్పన కలగలిపి వుంటాయి. నాటకీయత కూడా వుండవచ్చు. ఇలాంటి రచనల్లో వాస్తవికత మాత్రమే వుండాలి. అంతేకాదు అందులో సహజమైన విషయాల్లో కూడా నాటకీయత వున్నట్లు అనిపించవచ్చు. జీవితంలో వున్న వైవిధ్యం అదే!
రచయిత కావాలని ఎవరయినా అనుకోవచ్చు. రచయితగా రూపొందటం మాత్రం అంత సులభం కాదు. అందుకు ఎంతో కృషి కావాలి. అవమానాలు ఎదుర్కోవాలి. తిరస్కరణలను భరించాలి. ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుకోవాలి. మనం అనేక మంది................