మలగని బత్తి
అది నియంత రాజ్యం, చీకటి రాజ్యం. రాజ్యం. పేదల ముంగిట్లో, వారి జీవితాల్లో పొద్దు పొడవని రాజ్యం. ఎడతెగని దోపిడీకి పొద్దు గుంకని రాజ్యం, సంస్థానాధిపతులు, జాగీరుదార్లు, పైగాదార్లు, దేశముఖు, ఇనాందార్లు, ఆగ్రహారీకులు లక్షల ఎకరాల సాగుభూములను, అడవులను, తోటలను, కొండలను, చెరువులను తమ హక్కు భుక్తాలుగా చేసుకుని, సూదిమొన మోపినంత నేలనయినా నిరుపేదలకు ఇవ్వమని భీష్మించుకుని కూచున్న దుర్యోధనుల రాజ్యం. వెట్టి చాకిరి బలవంతపు వసూళ్లతో పేదల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న కబంధులు రాజ్యం. కంటికి నదురుగా కనిపించే యువతులను తమ కామదాహానికి ఆహుతి చేసే రావణ రాజ్యం. లక్షలాది కష్టజీవులను తిండికి బట్టకి ఎడబాపిన దోపిడీ రాజ్యం.
లక్షలాది బాలురు చదువుకు దూరమై, తండ్రి తీసుకున్న అప్పుకు తాకట్టు వస్తువుగా మారి పసులు కాస్తూ, వెట్టి చేస్తూ, జీవితంలో వెలుగు లేక వెలుగు అంటే ఏమిటో తెలియకుండా ఎదుగుతున్న చదువుల లేమి రాజ్యం. బాలికలు పెండ పోగేస్తూ, పిడుకలు చేస్తూ, ఇంటి పనులలో తల్లికి చేదోడు వాదోడుగా వుంటూ పెళ్లి అయ్యాక గాయిదిపని చేస్తూ, కైకిలి పోతూ తరతరాల బానిసత్వానికి బలి అవుతూ వంతల పాలవుతున్న చింతల రాజ్యం. మహా ఘనత వహించిన నిజాము ప్రభువు రాజ్యం.
ఆరుగాలం కష్టపడినా ఆకలి పేగుల అరుపులే తరతరాల పాటగా రాగాలు ఒలికిస్తున్న శృతి లయల రాజ్యం. దొరల గడీలలో పంచాయతీలకు బలి అవుతూ దందుగులకు అప్పులు చేస్తూ, ఇంకా మంచికి, చెడుకు అన్నిటికి అప్పుల ఊబిలోనే మరో అడుగు దిగబడుతూ చేసిన కష్టం మొత్తం మితీలకు చెల్లుకొట్టినా ఇంకా పెరుగుతున్న అప్పుల ఊబిలో కూరుకుని పోయిన, అంతము ఆధారము లేని పేదల బతుకుల మీద రుద్దబడిన కసాయి రాజ్యం..............