అగాధం
కొండ అంచుల మీద నిలబడి చుట్టూ చూసింది శ్యామల. ఠీవిగా నిలబడ్డ ఎత్తయిన కొండలు. నిశ్చలంగా తపస్సు చేస్తున్న మునుల్లా నిటారుగా నిలబడ్డ చెట్లు. మునులకి తపోభంగం చేయటానికి అప్సరసలు పాడే పాటల్లా వినపడుతున్న పక్షుల కిలకిలారావాలు. ఎంత సౌందర్యం! ఇక్కడినించి కిందికి దూకితే! ఒళ్ళు ఝల్లుమంది ఆమెకి.
చలికాలం ఇంకా పూర్తిగా రాలేదు. అయినా చలి అప్పుడే వణికిస్తోంది. ఆ పల్చటి చలి ఇబ్బందిగా వుండటం కంటే హాయిగా, గుచ్చుకుంటున్నట్టుంది. వేడి కాఫీ తాగాలనిపించింది. కానీ కాఫీ తాగాలంటే కొండ దిగి కిందికి వెళ్ళాలి. అప్పుడీ అందం చూడటానికుండదు. కిందంతా మాములు మనుషులూ, వాళ్ళ సమస్యలూ, ఉద్యోగాలూ, ప్రమోషన్లూ, పిల్లల అల్లరీ, విడాకుల గొడవలూ... టెరిబుల్ ఇదే, ప్రపంచంలోని శాంతినీ, అందాన్నీ ఒకేచోట కుప్ప పోసిన స్థలం. ఈ అందమూ, శాంతి కావాలంటే ఈ కొండంతా ఎక్కి పైకి రావాలి. ప్రకృతిని జయించిన భావనలోంచి పుట్టే గర్వం, ఆత్మవిశ్వాసం, అలసటా కలిసి ఇచ్చే అద్భుతమయిన అనుభూతి కావాలంటే తప్పదు మరి. దీని కోసం తనందుకే వీలున్నప్పుడల్లా వస్తుంది.
అగాధంలోకి చూస్తుంటే మనిషి మనసులోకి చూస్తున్నట్టనిపిస్తుంది. అంతా కనబడ్డట్టే వుంటుంది. కానీ ఎక్కడో ఒకమూల, కనపడకుండా చీకటిగా వుంటుంది.................