'మొగలులు' అనే పదం వింటూనే భవిష్యదర్శి అక్బర్. సుప్రసిద్ధ షాజహాన్
అందమైన, చురుకయిన నూర్జహాన్, నిరాడంబరుడు, పొదుపరి మత
ఛాందసుడయిన ఔరంగజేబు ప్రతిమలు మన మనసుల్లో కదలాడుతాయి. ఫతేపూర్ సిక్రి, షాజహానాబాద్ అనే కొత్త నగరాలు, తాజ్మహల్లోని వాస్తు శిల్పపరమైన అద్భుతాలు, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాన్లతో కూడిన ఎర్రకోట వంటివి మొగలుల పాలనను చిరస్మరణీయం చేశాయి. విజయవంతంగా అక్బర్ నిర్మించిన దేశం, చివరగా ఔరంగజేబు తరువాత తమలో తాము పోరాటాలు చేసుకొనే వారసత్వరాజ్యాలుగా ముక్కలు కావడం, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రాజకీయ అధికారం స్థాపించడానికి మార్గం వేశాయి. మొగలుల పాలన కేవలం స్మరణీయమేకాదు, మతాల ప్రాతిపదిక మీద సమాజం విడిపోవడం, విదేశీ దండయాత్రల వల్ల జరిగిన విధ్వంసం వంటి చేదు జ్ఞాపకాలను కూడా వదిలిపెట్టింది. నిరంతరం మారిపోతున్న రాజకీయ పరిణామాలకూ, సాంస్కృతికపరమైన అలజడులకూ భారత ప్రజలు గొప్ప అనుసరణీయతను ప్రదర్శించారు.
మొగలుల పాలన, పదహారో శతాబ్దం ప్రథమ పాదం చివర ప్రారంభమైంది. 17వ శతాబ్దం చివరి పాదం నాటికి ఉచ్ఛదశకు చేరుకొంది. 18వ శతాబ్దం చివరి దశాబ్దాల నాటికి మొగలు భవనంలో పగుళ్ళు స్పష్టంగా కనిపించసాగాయి. 19వ శతాబ్దం మధ్యకాలం వరకూ వారి పూర్వికులు వదిలిన ఛాయతో మొగలుల కాంతి మెల్లమెల్లగా కొనసాగింది. క్రీ.శ. 1526 నుంచి 1707 సంవత్సరం వరకు మొగలుల పాలనను 'దిగ్రేట్ మొగలుల' పాలనగా పేర్కొనవచ్చు. క్రీ.శ. 1707 నుంచి 1857 సంవత్సరం వరకు వారి పాలనా కాలాన్ని మలి మొగలుల పాలనగా పేర్కొంటారు.
మొగలుల చరిత్రలో ప్రముఖస్థానం వహించిన ఇద్దరు పోరాటయోధుల తైమూర్- ఎ-లంగ్, చంఘిజ్ ఖాన్ వంశస్థులు. వీరి స్వస్థలం అందమైన వృక్ష, జంతు సముదాయం పుష్కలంగా ఉన్న 'ఫెరోనా' (Ferghana) లోని ఒక్సస్, సిద్ర్యాల మధ్య ఉన్న ప్రాంతం, వీరు చగతాయ్ టర్క్లు. వీరు విదేశీయులయినప్పటికీ గతంలో కుషాణులు, శకులు, పహ్లవులు, టర్క్లు, ఆఫ్ఘన్లలాగా భారతదేశాన్ని తమ స్వస్థలం చేసుకొన్నారు.................