అవతారిక
కవిత్రయమువారి కాలములను ప్రదర్శింపవలెనని నే నారంభించిన నవలాత్రయము దీనితో పూర్తియైనది. నారాయణభట్టులో నన్నయను, రుద్రమదేవిలో తిక్కనను, ఈ మల్లారెడ్డిలో ఎర్రయను ప్రధాన పురుషులనుగా గ్రహించితిని. హరివంశావతారికయు ఆశ్వాసాంత పద్యములును, ఎర్రయ ఇతర గ్రంథములును పలుమారు పఠించుటచే ఇందలి కథాభాగము లెన్నియో సృష్టించుటకు సూచనలు లభించినవి. సూక్ష్మగ్రాహులగు సహృదయులకు నా కల్పనలు సమ్మోదావహములు కాగలవు. శ్రీనాథుని హరవిలాసావతారిక నుండి అవచి దేవయ శ్రేష్ఠి వైభవము గ్రహించితిని.
ఆ నాటి చరిత్ర గ్రహించుటకై శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మ 'History of the Reddi Kingdoms' & A Forgotten Chapter of Andhra History, డాక్టరు నేలటూరి వేంకటరమణయ్య, 'Kampili' and 'Vijayanagara' శ్రీ చిలుకూరి వీరభద్రరావు, 'ఆంధ్రుల చరిత్ర', ఆంద్రేతి హాస పరిశోధక మండలివారు ప్రచురించిన రెడ్డి సంచికయు, ఇతర వ్యాసములును నేను శ్రద్ధగా పఠించితిని. రెడ్డి సంచికకు ‘Forgotten Chapter' కును అనుబంధములుగా ప్రచురించిన ఆ నాటి శాసనములు నాకు విశేషముగా ఉపకరించినవి. సుప్రసిద్ధులగు చరిత్రకారులకు బహువిషయములలో అభిప్రాయభేదములున్నవి. ఒక్కొక్క విషయములో ఒక్కొక్కరి అభిప్రాయము నేను గ్రహించుటయు, కొన్ని విషయములలో వారెవ్వరితోడను ఏకీభవింపక స్వతంత్ర నిర్ణయము చేసికొనవలసి వచ్చుటయు తటస్థించినది. ఐనను వారందరు చేసిన కృతజ్ఞుడను.................