మళ్లీ వసంతం
ఇవ్వేళ ప్రభ పుట్టినరోజు. దానికి అయిదేళ్ళు నిండాయి. అతిథులైన డాక్టర్లు నర్సులు సమావేశమైన పార్టీలో శేఖరం అన్నాడు. "అమృతమూర్తి, ఆనందమూర్తియైన చిట్టిప్రభకు తల్లివైనందుకు అభినందనలు!" అని. ఆస్పత్రి ఆధికారి హోదాలో డాక్టరు చంద్రశేఖరం ప్రభను మెచ్చుకుంటూ నా వైపు తిరిగి అలా అంటూంటే నేను మౌనం వహించాను.
శేఖరం ఈ వూరికి బదిలీ అయి ఒక నెల గడిచింది. ఆస్పత్రిలో చార్జీ తీసుకొన్నరోజే ఒక్క లిప్తకాలం నన్ను పన్నెండేళ్ళక్రితం పరిచయము ఉన్నవ్యక్తిగా గుర్తించాడు. శేఖరం మనస్సు వెనక్కి మళ్ళినట్లుగా ఆ కళ్ళల్లో తళుక్కున మెరిసి మాయమైన భావరేఖ వ్యక్తం చేసింది... కాని యధావిధిగా, అందరితోబాటు పరిచయలాంఛనం జరిగిపోవటంతో ప్రాతజ్ఞాపకాల ప్రసక్తిరాలేదు మాటల్లో ఎక్కడా.
శేఖరాన్ని ఇక్కడికి బదిలీ చేశారన్న వార్త తెలిసినప్పుడే అనుకొన్నాను... పన్నెండేళ్ళ నాటి సంగతి; ఆ పరిచయానికి ప్రాధాన్యం ఏమీలేదు అని.... ఇన్నాళ్ళ తర్వాత శేఖరానికి కాని, నాకుకాని, అప్పటి సంగతులు గుర్తుతెచ్చుకోవలసిన అవసరం వుండదు!... ఉద్యోగరీత్యా మళ్ళీ కలుసుకోవడం సంభవిస్తున్నా ప్రస్తుతానికీ గతానికి సంబంధం ఏమిటి?..... అనుకొన్నదానికి అనుగుణంగానే శేఖరం కూడా ప్రవర్తించాడు, నన్ను గుర్తించాడో లేదో అన్నట్లు!
....
ఒక్క నెలరోజులు........శేఖరం ప్రవర్తన నాలో కొంత కుతూహలాన్ని కలిగించక ! పోలేదు. నేనెలా అనుకొన్నా, అతని వైఖరి కూడా అక్షరాలా అలానే వుండటం నాకు ఆశ్చర్యాన్నీ, అసంతృప్తినీ కలిగించిందంటే అది అసహజం కాదేమో!.... అంతా మన మనుకునే విధంగానే జీవితం రూపొందుతూవుంటే అదీ దుస్సహమే అవుతుంది; ఒక మోతాదు మార్పు అవ్యక్తంగా ఎప్పుడూ ఆకాంక్షిస్తూనే వుంటాము; ఆ మాత్రం క్రొత్తదనం కనిపించకపోతే తృప్తి వుండదు; నిరుత్సాహం కలుగుతుంది.
శేఖరం మళ్ళీ తారసిల్లడం నిజంగా ఒక ముఖ్యమైన సంఘటనే. మెడికల్ కాలేజి............