ఆ గదిలో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నా ఆ గదిలో ఉన్న నలుగురి నుదుట చెమట ధారాళంగా కారుతుంది. తెలియని ఆందోళన తికమక పెడ్తుంది. కాలం నడకమాని మూలన కుర్చొందేమొనన్న సందేహం కలిగింది ముసలాయనికి.
"చట్! ఎదవ గోల ఎదవ గోల. మరీ మడిసికి ఇంత పంతం పనికి రాదు..." మెల్లగా కొడుకు గొణుకున్నా గదిలో అందరికి స్పష్టంగానే వినిపించింది. బహుశా వినబడాలనే అన్నాడేమో. కొడుకు గొణుకిడికి మెల్లగా తలతిప్పి చూసాడు. ముసలాయన.
"బాప్పా, బాప్పా! కాసింట టీ తాగుతావేటి?” మంచంపై పడుకున్న అత్తను కదుపుతూ అడిగింది కోడలు .
ముసలాయన మంచం మీద పడుకున్న తన భార్య వైపు చూసాడు. నిజంగా పడుకుందో, లేకా కళ్ళు మూసుకొని ఉందో తెలియదుగాని కదలకుండ పడుకొని ఉంది.
కొడుకు ముఖం చూసాడు... ముళ్ళమీద నిల్చునట్లు చాలా అసహనంగా ఉన్నాడు. కోడల్ని చూసాడు ఈ యవ్వారమేదో బేగి తేలిపోతో బాగున్ను అన్నట్లు
కుంది.
“యెసెన్, ఎంతసేపు ఇలా కూకొంటాము. అవతల వేనోడు ఒచ్చేస్తుంటాడు. టైమయిపోతున్నది కదా” నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తూ వచ్చిన కొడుకు మాటలకు తలూపాడు ముసలాయన.
"నిజమేరా, మరి ఇది ఇలా మొండికేసి కూకుంది కదా, నానేటి సేసెది సెప్పు"... నిస్సహాయంగా అన్నాడు ముసలాయన.
అసహనాన్ని అణుచుకుంటూ "అమ్మా! లెగు లెగు, వేనోడు ఒచ్చేసాడు. "మనూరెల్లి పోదాం" తల్లిని పిలుస్తూ లేపబోయాడు కొడుకు. కాని తను ఆశించిన స్పందన తల్లి నుంచి రాకపోయేసరికి "ఛీ, నీయమ్మ జీవితం" అని తిట్టుకుంటూ గదిలోంచి బయటకి పోయాడు.................