మనస్సాక్షి
సూర్యనారాయణ గంట క్రితం వరకు బతికే ఉన్నాడు. ప్రస్తుతం శవంగా మారిపోయేడు. మనిషి శవంగా మారడానికి గంటక్కర్లేదు. రెప్పపాటు చాలు. "జయాపజయాలు దైవాధీనాలు” అంటారు. “చావు, పుట్టుకలూ దైవాధీనాలే" మరి! ఇంక మన చేతిలో ఏవుందీ?... చేతులెత్తేయడమే! కొంతమందికి కడుపులో ఉన్నప్పుడే కాలం చెల్లిపోతుంది. కొంతమందికి పురుటిలోనే సంధి కొడుతుంది. మరికొంతమంది అర్దాయుషుగాళ్ళు ఉంటారు. సూర్యనారాయణ కేవలం పావు అయుషు వాడు. పాతికేళ్ళకే నూరేళ్ళు నిండిపోయేయి.
నింద లేనిదే బొంది పోదుట.
సూర్యనారాయణ బొంది పోవడానికి నింద లారీ రూపంలో వచ్చింది.
“They die young whom The God loves" అంటారు.
కాని అది సూర్యనారాయణ విషయంలో నిజం కాదు.
దేవుఁడే గనక ఉంటే, సూర్యనారాయణంటే నిజంగా ఇష్టం ఉంటే, అతని బతుకు
అంత ఘోరంగా ఉండేది కాదు.
అతను ఉంటున్న దాన్ని ఇల్లు అనరు.
ఒక చిన్న కొట్టులాంటి గది, ఒక చీకటి వరండా.
అది ఏడు వాటాల వాస.
దూరం నుంచి చూస్తే మనుషులుండే ఇల్లులా కనిపించదు. దగ్గర్నుంచి చూసినాఅలా అనిపించదు.
ఎప్పుడు కట్టేరో చెప్పడం కష్టం.
కాని కట్టిన తరవాత మళ్ళీ సున్నం వెయ్యటం, రిపేర్లు వగైరాలేం జరగలేదు.
వీళ్ళంతా ఎప్పుడు ఖాళీ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాయి వీధిలో తిరిగే
ఆ ఏడు వాటాల్లో ఎవరు కరెంటు బిల్లు కట్టకపోయినా, అందరికీ కరెంటు...............