స్వీయచారిత్రకము
నా జీవిత చరిత్రను యథాతథముగా వ్రాయుట నా యుద్దేశము కాదు. సత్యాన్వేషణలో నే నాచరించిన ప్రయోగముల గాథను ఊరక వివరించుటయే ఆ తలంపు. నా జీవితమంతయు ఏతత్ ప్రయోగమే గనుక ఈ గాథ ఆత్మకథారూపముగా పరిణమించవచ్చును. ఇందలి ప్రతివాక్యము సత్యాన్వేషణా వివరణమే యగునేని ఈ గ్రంథము ఆత్మకథగా భాసించినను నేను చింతింపను.
రాజకీయ క్షేత్రమునందలి నా ప్రయోగములు, భారతదేశమునకే కాక, సర్వసభ్య ప్రపంచమునకు చాలవరకు విదితములే. నామట్టుకు నేను వాటిని అంతగా పరిగణింపను. వాటివల్ల నాకు లభించిన 'మహాత్ముడు' అను బిరుదముకూడ అంతకంటే పరిగణనీయము కాదు. ఈ బిరుదము నాకు మాటిమాటికి మనోవ్యధ కల్గించును. దానివల్ల నేను ఇసుమంతయైనను ఎన్నడును ఉబ్బిపోలేదు. ఆధ్యాత్మిక క్షేత్రములో నేను సల్పిన ప్రయోగములు, వాటి అంతరార్థము నాకు మాత్రమే ఎఱుక. వాటివల్లనే రాజకీయ రంగమున వ్యవహరింపగలశక్తి నాకు లభించినది. వాటిని వివరించుట నా విధి. ఈ ప్రయోగములకు నిజమైన ఆధ్యాత్మిక అర్ధమే యున్నచో అవి నా అకించనత్వమునకు కారణమగునేకాని, ఆత్మస్తుతికి కారణము కావు. నేను నా జీవితయాత్రను సింహావలోకనము చేసికొనినకొలది నా లోపములు అంతకంతకు స్పష్టతరముగా గోచరించుచుండును.
గడచిన ముప్పది సంవత్సరములుగా నేను పడిన పాటు, పొందిన వ్యధ అంతయు, ఆత్మసిద్ధికొఱకు - ఈశ్వరుని ముఖాముఖి దర్శించుట కొఱకు - మోక్ష ప్రాప్తికొరకు. ఈ గమ్యమును చేరదలచిన యాత్రయే నా జీవితము, నా వర్తనము, నా అస్తిత్వము,.................