తెగిన గాలిపటం
భూమిలోకి దిగి పాతుకుపోయిన ఊడలమర్రి కింద తాడు ముడులు విప్పుతూ. కూర్చున్నాడు యాదయ్య. కొమ్మల సందుల్లోనుండి పడుతున్న లేలేత కిరణాలు క్రమక్రమంగా పెరగసాగాయి. బతుకుముడులు విప్పుకునే అవకాశం లేని తను, తనకు ఆధారమైన తాళ్లకు ముడులిప్పడం ఆశ్చర్యంగా తోచి తనలో తనే నవ్వుకున్నాడు యాదయ్య.
పుట్టినప్పటినుండీ తన బతుకు చిన్న చిన్న సాహసాల మధ్యే గడిచింది. గుండ్రంగా ఉన్న ఇనుపచువ్వల మధ్యలో నుండి అటూఇటూ దూకడం, ఇనుపరింగులలో తన దేహాన్ని దూర్చి బయటికి వచ్చాక అందరికీ ఆనందం కలిగించడం, ఒక్కోసారి అంటించిన మంటల్లోనుంచి దూకి అబ్బురపరచడం మొదట్లో భయం భయంగానే అనిపించినా రానురానూ అలవాటుగా మారిపోయింది. పెళ్లయ్యాక పిల్లలు పుట్టాకా కూడా అదే తన బతుకుకు ఆదరువుగా మారిపోయింది. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలా పెరిగాడో తెలియదు. ఒక ఊరినుండి మరో ఊరికి, ఆ ఊరు నుండి ఇంకో ఊరుకీ ప్రయాణం సాగుతూనే ఉంది. చేసిన విన్యాసాలు చూసి చప్పట్లు ఈలలతో హడావిడి చేసేవారే గానీ ఒక్కరు కూడా చిల్లర రాల్చేవారు కాదు. ఒళ్ళు గగుర్పొడిచే సాహస విన్యాసాలు చేస్తున్న తన చిన్నపిల్లల్ని చూసి 'అయ్య బాబోయ్' అని ఆశ్చర్యపడేవారే గానీ వాళ్లని పిల్చి అభినందించి అర్ధరూపాయి బహుమతి ఇచ్చేవారు లేరు. తను ఒకప్పుడు తన తండ్రికి కొడుకు.. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రి. విన్యాసాలు చేయకుండా విస్తర్లు లేవని తన జీవితాన్ని తల్చుకోగానే యాదయ్య మనసంతా విషాదం నిండిపోయింది.
“నానా... అమ్మెప్పుడొస్తుంది... నాకు ఆకలవుతుంది" అన్న కూతురి మాటలతో ఆలోచనలను విదుల్చుకుంటూ ఈ లోకంలోకి వచ్చి ఆడుకుంటున్న కూతురివంక చూశాడు. మూడేళ్ల కూతురు లచ్చి... డ్రాయరు వేసుకుని అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లిమొగ్గలతో సంతోషపడుతోంది.
డప్పులు లయబద్ధంగా మోగుతున్నాయి. చుట్టుపక్కల రైతులంతా పొలంచుట్టూ చేరారు. ప్రొద్దున పూట ఎండే అయినా చురుక్కుమంటోంది. ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న తాడుమీద నడుస్తోంది సాయవ్వ. చేతిలో ఆసరాగా గెడకర్రను పట్టుకుని తాడుమీద............