హద్దులు, సరిహద్దులు
ప్రొ. పద్మజా షా
సంపాదకురాలు
సరిహద్దులు సర్వ సమ్మతితో గుర్తించుకోవటం, వాటిని కాపాడుకొనే ప్రక్రియలో మానవీయత విధించే హద్దులను వదులుకోకుండా ఒక రాజ్యం వ్యవహరించటం నాగరికతని సూచిస్తాయి. కానీ కొన్ని రకాల రాజకీయ సంస్కృతులు స్వలాభం తప్ప మానవీయతను, సర్వ సమ్మతిని పెద్దగా పట్టించుకోవు. అటువంటి సందర్భాల్లో ప్రజలు విధ్వంసం, ఊహించలేనంత ప్రాణ, ఆస్తి నష్టాలు అనుభవిస్తారు.
అటువంటి సందర్భమే ఇప్పటికి ఏడు నెలలుగా (మే 2023) మణిపూర్ రాష్ట్రం లోని ప్రజలు అనుభవిస్తున్నారు. మే మూడున కూకీ మహిళలను నగ్నంగా వీధుల్లో తిప్పి భయంకరమైన స్థాయిలో సామూహిక లైంగిక హింసకు గురి చేసిన దృశ్యాలు దేశాన్ని కదలించేసాయేమో కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని మాత్రం కదిలించలేక పోయాయి. వీడియోలు లీక్ కాకపోతే విషయం బయటకు వచ్చేది కాదు. వచ్చినా యిప్పటి వరకు నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
మణిపూర్ లోయ ప్రాంతంలో మెయితీలు, లోయ చుట్టూ ఉన్న అందమైన పచ్చని కొండల్లో కుకీ, నాగ తెగలు నివసిస్తుంటారు. దాదాపు 2000 ఏళ్ల లిఖిత చరిత్ర గల ఈ ప్రాంతం రాచరికం నుండి 1949 లో భారత్ లో విలీనం అయ్యింది. ఆ విలీనం నాటి చరిత్రను ఈ పుస్తకం లోని మొదటి వ్యాసం వివరిస్తుంది. ఒక పెద్ద దేశం తన సరిహద్దుల్లోని ఒక ప్రదేశాన్ని విలీనం చేసుకున్నప్పుడు దేశ ప్రయోజనాల పేరిట స్థానిక ప్రజానీకం ఆకాంక్షల నుంచి పుట్టే హద్దుల్ని దాటి విలీనాన్ని బలవంతంగా ఎట్లా దిగమింగించగలదో చెప్తుంది................