మంకెన పువ్వు
జైలు తలుపులు ఎత్తుగా న్యాయానికి చిహ్నంగా నిలిచి వున్నాయి. వెడల్పాటి ఆ కర్ర తలుపులకి వెనుక యినుపగొళ్ళాలు దృఢంగా, భీకరంగా వున్నాయి. ఆ జైలు తలుపులకు ముందు ఒక చిన్న గుంపు గుమిగూడి వుంది. ఆ గుంపులో స్త్రీ పురుషులిద్దరూ వున్నారు. మొగవారు పొడుగ్గాటి గడ్డాల్తో, బూడిదరంగు బట్టలు కట్టుకొని కుతూహలంగా ఆ గేట్లవైపు చూస్తున్నారు. ఆడవాళ్ళు అవే గేట్లవైపు కోపంగా, కసిగా చూస్తున్నారు.
అమెరికాలోని అన్ని నగరాలకు మల్లేనే ఈ వూళ్ళోనూ భగవత్ భక్తికీ, పరలోక చింతనకీ ప్రతీకగా ఒక చర్చి, జీవితపు అస్థిరత్వానికి చిహ్నంగా ఒక స్మశానవాటిక, జీవితంలోని దుర్బలత్వానికి ప్రతిబింబంగా ఒక కారాగారమూ వున్నాయి. జైలు ఆవరణ అన్ని జైళ్ళ లాగానే బోసిగా, నేరాలకీ శిక్షలకీ ప్రతిరూపంగా, నిరాశానిస్పృహలకు ప్రతీకగా నిలిచి వుంది. మానవ నాగరికత ఎంత ప్రాచీనమైనదో - నేరాలూ, శిక్షలూ కూడా అంత పురాతనమైనవి. ఆ పురాతనత్వానికి సూచనగా జైలు తలుపులు ఎండలకి ఎండి, వానలకి తడిసి బండబారి పోయినాయి. నేరస్థుల హృదయాలకి మల్లేనే, వారి మనసులలో మెత్తదనానికీ, లాలిత్యానికీ తావులేనట్లే ఆ జైలు తలుపులు కూడా ఏళ్ళ బరువుతో ఎండి, మాడి వెలాతెలా పోతున్నాయి. జైలు తలుపులకీ, రోడ్డుకీ మధ్య వున్న ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలూ, గడ్డి వత్తుగా మొలిచి వున్నాయి. ఎవరికీ ఉపయోగం లేని యీ పిచ్చిమొక్కలు సమాజానికి పనికిరాని నేరస్థులతో జతకట్టి ఈ మూలకి వచ్చి దాక్కున్నాయి అన్నంత వత్తుగా పెరిగాయి. వీటికి కాస్త పక్కగా, ఒకవైపుగా ఒకే ఒక్క గులాబీ చెట్టు వుంది. జూన్ మాసంలో ఆ తెల్లగులాబీ..................