మిణుకు
ప్రస్తావన
జీవితానికి అర్థమేమిటి? ప్రపంచమంటే ఏమిటి? ఈ రెండింటికీ సంబంధమేమిటి? అంతకు మించి కనపడనిదేమైననూ ఉందా? ఉంటే, అదేమిటి? దానికి జ్ఞానమే ప్రమాణమా? ఈ సృష్టి ఒక చిక్కు ప్రశ్న. ఈ చిక్కు తీసి విడమరచి చెప్పేవారెవరు? ఒక్క చేతితో నిర్మించబడిన ఈ జగతిలో ఇన్ని విధాల జీవగతులెందుకు? జీవితనాయకుడెవరు? ఒక్కడేనా? అనేకమంది ఉ న్నారా? ఆ నాయకుడు విధి అయి ఉంటుందా? లేక పౌరుషమా? ధర్మమా? అంధ బలమా? ఈ అవ్యవస్థ కుదురుకునే మార్గం ఉందా? లేక, చివరికి అంతులేని కలవరమే ఈ లోకానికి గతి అవుతుందా? సృష్టిలో ఏదైనా ఒక్క క్రమం అంటూ ఉందా? దానికొక లక్ష్యమంటూ ఉందా? సృష్టికర్తకు తను సృష్టించిన జగద్విషయంలో ఇది తనదనే ప్రేమే గానీ ఉంటే ఈ జీవులెందుకిలా కష్టపడుతున్నట్టు? మానవుని ధ్యేయమేమిటి? దానికెంత మూల్యం చెల్లించాల్సి వస్తోంది! దీనికొక ముగింపు అంటూ ఉందా? వీటికొక అర్థం ఉందా? 'మంకుతిమ్మని మిణుకు' ఇలా ప్రశ్నావళితోనే మొదలవుతుంది. ఇది డి.వి.జి. గారి రచన వెనుక ఉన్న ఆంతర్యాన్ని చూపిస్తుంది. మానవ జీవన రహస్యాల్ని గురించి అనాది నుంచి నేటి వరకూ చెప్పిన దార్శనికుల, తాత్వికుల అనుభవజ్ఞుల, ప్రజల భావాలనూ నిర్ణయాలనూ గణనలోకి తీసుకుని స్వానుభవంతో విమర్శించి, తనదైన సిద్దాంతాన్ని వారు కనుగొన్నారు. ఆ తత్వాలనే అనుసంధానించారు. డి.వి.జి. రచనలూ, జీవితమూ వేర్వేరు కాదు, ఒకటేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆయన అలాంటి ఋషితుల్యులు. తను సిద్ధపరచుకొన్న తత్త్వమే లౌకిక జీవన మార్గంలో ఆయనకు వెలుగుదివ్వె అయింది. తను చూసిన ఆ వెలుగు ప్రజలందరికీ చూపాలన్నదే వారి ప్రధాన సాహితీ లక్ష్యం!
'మంకుతిమ్మన కగ్గా'
కన్నడంలో ఈ గ్రంథం 'మంకుతిమ్మనకగ్గ' పుట్టి ఎనిమిది దశాబ్దాలు గడచినా ఈ మహత్ గ్రంథానికి ఏ మతప్రాపకం గానీ రాజకీయపోషణ గానీ సంప్రదాయ ప్రోత్సాహం గానీ సంస్థల ఆదరణ గానీ విశ్వవిద్యాలయాల సహాయ బలంగానీ లేవు. కేవలం ప్రజల మన్ననలోనే ఊపిరి పోసుకొని జనమానసంలో భద్రంగా నెలకొన్న కొన్ని అరుదైన కన్నడ కృతులలో ఇది ప్రథమశ్రేణికి చెందినది' అంటారు శతావధాని డా. రా. గణేశ్. దీన్ని కన్నడ భగవద్గీత అని చెప్పుకుంటారు. కర్ణాటక ప్రాంతంలో ఇప్పటికీ ఏ దినపత్రికలో చూసినా 'కర్ణ' పద్యం ఎక్కడో